డ్రైవర్ అప్రమత్తతే కాపాడింది
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:32 PM
సమయం.. శనివారం తెల్లవారుజాము 4.30 గంటలు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రయ్‌మంటూ బస్సు దూసుకుపోతుంది.
- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
- టైర్ పంక్చర్ కావడంతోనే..
- ప్రయాణికులు సురక్షితం
- బస్సును నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం
- ప్రయాణికుల్లో ఒడిశా ఎమ్మెల్యే
రామభద్రపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సమయం.. శనివారం తెల్లవారుజాము 4.30 గంటలు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రయ్‌మంటూ బస్సు దూసుకుపోతుంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్క కుదుపు. బస్సు వెనుక టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం. అంతే ప్రయాణికులకు నిద్రమత్తు వదిలింది. ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును పక్కకు ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అందరినీ బస్సులో నుంచి దించివేశాడు. ఆ వెంటనే మంటలకు బస్సు ఆహుతైంది. ఈ పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన రామభద్రపురం మండల కేంద్రంలోని తారాపురం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి శుక్రవారం రాత్రి 7.45 గంటలకు 42 మంది ప్రయాణికులతో ఆరెంజ్ ట్రావెల్ బస్సు మల్కన్‌గిరి(ఒడిశా)కి బయలుదేరింది. ఈ బస్సు శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు రామభద్రపురం మండల కేంద్రంలోని తారాపురం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ దశరథ్ ఒక్కసారిగా బస్సును పక్కకు నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి అందరిని బస్సులో నుంచి దించి వేశాడు. ప్రయాణికుల్లో ఒడిశా రాష్ట్రం చిత్రకోట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంగు కిల్లా కూడా ఉన్నారు. ఆ వెంటనే బస్సు మంటలకు ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే బాడంగి ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు ఆయిల్ ట్యాంకర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వెనుకవస్తున్న మరో ట్రావెల్ బస్సులో పోలీసులు ప్రయాణికులను ఎక్కించి ఒడిశాకు పంపించారు. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం 7.40గంటల వరకు బస్సు నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్‌ను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.
మహిళకు బంగారం అందజేత..
సిమిడిగుడకు చెందిన శాంతిలత అనే మహిళ ఓ పెళ్లి కార్యక్రమానికి బస్సులో వస్తుండగా ఈ సంఘటన జరిగింది. దిగుతున్న సమయంలో సుమారు ఆరు తులాల బంగారపు వస్తువులు ఉన్న ఆమె పర్సు బస్సులో పడిపోయింది. బొబ్బిలి రూరల్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు, పోలీసు సిబ్బంది బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బంగారం దొరకడంతో ఆమెకు అందించారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.