ZP was formed. కల నెరవేరింది.. జడ్పీ ఏర్పాటైంది
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:20 AM
The dream came true.. ZP was formed. నూతన జిల్లా ప్రాతి పదికన మన్యంలో ఎట్టకేలకు జిల్లా పరిషత్ ఏర్పాటైంది. పార్వతీపురం మండలం నర్సిపురంలోని డీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా జడ్పీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించి.. ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
డీడీవో భవనంలో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు
విధుల్లో చేరిన అధికారులు, సిబ్బంది
ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం /పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నూతన జిల్లా ప్రాతి పదికన మన్యంలో ఎట్టకేలకు జిల్లా పరిషత్ ఏర్పాటైంది. పార్వతీపురం మండలం నర్సిపురంలోని డీడీవో కార్యాలయంలో తాత్కాలికంగా జడ్పీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించి.. ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జడ్పీ సీఈవో నియామకం మాత్రం పూర్తికాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన అధికారులు, సిబ్బంది శుక్రవారం జిల్లా పరిషత్‌లో తమ విధులను ప్రారంభిం చారు. మొత్తంగా జిల్లా నుంచి జడ్పీ కార్యకలాపాలు ప్రారంభమవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మన్యం జిల్లాలో జడ్పీ కార్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. స్థానిక ఎన్నికల తర్వాత నూతన పాలకవర్గం కొలువుదీరనుందని వెల్లడించారు. కాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జడ్పీ కార్యాలయానికి కేటాయించిన సిబ్బంది తదితర వివరాలను ఉమ్మడి జడ్పీ సీఈవో లవరాజు కలెక్టర్‌కు వివరిం చారు. అన్ని విభాగాలకు సిబ్బందిని నియమించాలని, ప్రతిఒక్కరికీ జాబ్‌చార్టు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత ఐదేళ్లుగా జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులు వివరాలను నివేదిక రూపంలో తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు ప్రభావతి, రామచంద్రరావు, డీఏవో భవానీశంకర్, మత్స్యశాఖ అధికారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక వేర్వేరుగా జడ్పీలు
ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ విభజన పూర్తయినట్లే. ఇక పార్వతీపురం మన్యం, విజయనగరంలో వేర్వేరుగా జడ్పీలు కొనసాగుతాయి. కాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఉన్న 11 మండలాలు మన్యంలో భాగమయ్యాయి. సాలూరు, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మ లక్ష్మీపురంతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు విలీనమయ్యాయి. ఇప్పటికే జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియగా.. శుక్రవారం కొత్త జడ్పీలో అధికారులు, సిబ్బంది బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పాటైన మన్యం జిల్లా ప్రజాపరిషత్‌కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 19మంది అధికారులు, సిబ్బందిని కేటాయిం చారు. అందులో ఇద్దరు ఏవోలు, నలుగురు సీనియర్ సహాయకులు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు, రికార్డు అసిస్టెంటు, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లతో పాటు డ్రైవరు, స్టెనో ఉన్నారు.