Share News

The difficulties of 'Banda' ‘బండ’డు కష్టాలు

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:01 AM

The difficulties of 'Banda' గ్యాస్‌ కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ బుకింగ్‌, డెలివరీకి సంబంధించి గ్యాస్‌ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఖాళీ సిలిండర్లు పట్టుకుని వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

The difficulties of 'Banda' ‘బండ’డు కష్టాలు
భోగాపురం వద్ద గ్యాస్‌ కోసం క్యూకట్టిన వినియోగదారులు

‘బండ’డు కష్టాలు

బుక్‌ చేసినా రోజుల తరబడి అందని గ్యాస్‌

నిరాశ చెందుతున్న గ్యాస్‌ వినియోగదారులు

పొంతన లేని అధికారుల ప్రకటనలు

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి):

గ్యాస్‌ కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ బుకింగ్‌, డెలివరీకి సంబంధించి గ్యాస్‌ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఖాళీ సిలిండర్లు పట్టుకుని వినియోగదారులు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆ క్రమంలో విసిగివేసారి కొందరు ఆందోళనకు దిగుతున్నారు. గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు గ్యాస్‌ సరఫరాపై అధికారులు ఇస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన ఉండడం లేదు. జిల్లాలో 32 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం సిలిండర్ల కోసం దాదాపు 74,586 మంది వినియోగదారులు బుక్‌ చేసుకున్నారు. బుధవారం 27,073 మందికే డెలివరీ ఇచ్చారు. ఎక్కువగా హెపీసీఎల్‌ కంపెనీ వారి వద్ద దాదాపు 72,200 పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్యాస్‌ బుకింగ్‌పై కంపెనీలు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. డబుల్‌ సిలిండర్‌ ఉంటే 35 రోజులు తరువాత రీఫిల్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటోంది. ఉజ్వల కనెక్షన్‌ ఉన్నవారు 45 రోజుల తరువాత బుకింగ్‌ చేసుకోవాలి. సింగిల్‌ సిలిండర్‌ ఉన్నవారు 25 రోజుల తరువాత బుక్‌ చేసుకోవాలని కంపెనీలు చెబుతున్నాయి. గడువులోగా బుక్‌ చేసుకోకపోతే ఆటోమెటిక్‌గా బుకింగ్‌ రద్దు అవుతుంది. గ్యాస్‌ కొరత అంశాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాథ్‌ వద్ద ప్రస్తావించగా జిల్లాలో గ్యాస్‌ బుక్‌ చేసుకున్నవారందరికీ షెడ్యూల్‌ ప్రకారం సిలిండర్లు డెలివరీ చేస్తున్నామన్నారు. ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని, స్టాక్‌ వస్తోందని వెల్లడించారు.

ఏజెన్సీ వద్ద నిరీక్షణ

రాజాం రూరల్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

రాజాం పట్టణం పరిధిలో గ్యాస్‌ అందుబాటులో లేని సమయంలో ఏజెన్సీలు మూసివేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మూడురోజుల క్రితం డోలపేటలోని గ్యాస్‌ ఏజెన్సీ తెరుచుకోకపోవడంతో రాజాం, రేగిడి, వంగర మండలాల వినియోగదారులు ఏజెన్సీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తాజాగా బుధవారం కూడా గ్యాస్‌ ఏజెన్సీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్యాస్‌ ఏజెన్సీ తెరిచిన క్షణాల్లోనే పెద్దసంఖ్యలో వినియోగదారులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రాధాన్యత క్రమంలో గ్యాస్‌ అందించేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ అందరూ ఏజెన్సీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఒకానొకదశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పాఠశాలలకు వంట గ్యాస్‌ కొరత

బొబ్బిలి రూరల్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు పాఠశాలల్లో వంట గ్యాస్‌ కొరత కారణంగా వంట చేయడానికి ఎండీఎం వర్కర్లు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలవరాయి, కోమటిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి బుఽధవారం గ్యాస్‌ సరఫరా సరిగా లేక నిర్వాహకులు కట్టెలపైనే వంట చేశారు. మండలంలో సగానికిపైగా పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది.

వినియోగదారుల బారులు

భోగాపురం, మార్చి25(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ దొరుకుతుందో లేదోనని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించినా సెల్‌కు ఓటీపీలు రావడంలేదు. ఓటీపీ వస్తే గ్యాస్‌ వచ్చినంతగా ఫీలవుతున్నారు. ఓటీపీలు వచ్చిన తర్వాత కూడా గ్యాస్‌ కోసం వినియోగదారులు ఉదయం నుంచీ బారులుతీరుతున్నారు. భోగాపురం గ్రామంలోని ఏజెన్సీ కార్యాలయం వద్ద నిత్యం భారీ క్యూ కనిపిస్తోంది. స్టాకు తక్కువగా వస్తుండడంతో నిర్వాహకులు పోలీసుల సహాయంతో గ్యాస్‌ వినియోగదారుల్ని క్యూ కట్టించి ఒక్కొక్కరికీ ఓటీపీ నమోదు చేస్తూ సిలిండర్లు అందజేస్తున్నారు.

డీఎస్‌వోకు ఫిర్యాదు

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసి 25 రోజులు దాటినా ఇవ్వడం లేదని విజయనగరంలోని వినియోగదారులు అందోళన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాథ్‌ను కలిసి సమస్యను వివరించారు. తమకు గ్యాస్‌ డెలివిరీ చేసినట్లు క్యాష్‌ మెమో వస్తోందని, వెంటనే గ్యాస్‌ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 12:01 AM