భక్తులకు అసౌకర్యం కలగకూడదు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:15 AM
ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శంబర పోలమాంబ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
-శంబర జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
-పారిశుధ్య పనులకు ప్రత్యేక డ్రైవ్
-ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించాం
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
మక్కువరూరల్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శంబర పోలమాంబ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శంబర జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినందున గిరిజన దేవత పోలమాంబ దర్శనానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించినట్లు తెలిపారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.50లక్షలు కేటాయించిందన్నారు. ముందుగా రూ.20లక్షలు విడుదలైనట్లు చెప్పారు. ‘శంబర గ్రామంలో పారిశుధ్య పనులు సంపూర్ణంగా చేపట్టాలి. మురుగు నీరు, చెత్త ఎక్కడా కనిపించకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. ఎంపీడీవో, డిప్యూటీఎంపీడీవో, డీఎల్‌పీవోలు పర్యవేక్షించాలి. వాహనాలు, భక్తుల రద్దీతో దుమ్ముధూళి ఎగరకుండా ప్రతిరోజూ రోడ్లను నీటితో తడపాలి. వనంగుడి, చదురుగుడి పరిసరాల్లో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు తలెత్తకుండా చైర్మన్, దేవదాయశాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. డీఎల్‌పీవోలు, ఐదుగురు తహసీల్దార్లు, గ్రామకార్యదర్శులు ప్రతిరోజూ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ గ్రామాన్ని ముస్తాబు చేయాలి.’అని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లు, భవనాలశాఖ ఏఈ విజయకుమార్ మాట్లాడుతూ.. బొబ్బిలి-మక్కువ రహదారిపై ఉన్న గోతులను పూడ్చినట్లు తెలిపారు. సాలూరు, పార్వతీపురం, విజయనగరం, ఎస్.కోట, పాలకొండ డిపోల నుంచి 222బస్సులను నడుపనున్నట్లు చెప్పారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800మందితో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి తెలిపారు. సిరిమాను ఊరేగింపులో రోప్‌వేలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఆరు డ్రోన్లతో ఉత్సవాలను పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ యశ్వంతకుమార్ రెడ్డి, పార్వతీపురం సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, ఆలయ ట్రస్టీ బోర్డు చైర్మన్ నైదాన చినతిరుపతి, శంబర ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ, దేవదాయశాఖ సిబ్బంది మురళి, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలను అమర్చాలి:ఎస్పీ
పోలమాంబ జాతరకు సంబంధించి క్యూలైన్లు, రెండు ఆలయాల వద్ద, గోముఖి నదీ తీరంలో సీసీ కెమెరాలను అమర్చాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన శంబర గ్రామాన్ని సందర్శించారు. జాతరలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. జాతర జరిగే మొత్తం ప్రాంతాన్ని కమెండ్‌కంట్రోల్ ఆధీనంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలు పార్కింగ్, దారి మళ్లింపు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశంలోకి ప్రజలు చొరబడకుండా క్లియరెర్స్ రోప్ పార్టీలను నియమించుకోవాలని సూచించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనిషారెడ్డి, ఎస్పీసీఐ రమణమూర్తి, సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.