ముందురోజు హల్‌చల్.. మరునాడు ఆత్మహత్య
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:49 PM
ముందురోజు గ్రామంలో హల్‌చల్ చేసిన బాలుడు మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన శృంగవరపుకోట మండలం చీడిపాలెంలో చోటు చేసుకుంది.
-బాలుడి విషాదాంతం ఇదీ
- హెచ్చరించి వదిలేసిన పోలీసులు
- మరుసటి రోజే ఇంట్లో బలవన్మరణం
ఎస్.కోటరూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ముందురోజు గ్రామంలో హల్‌చల్ చేసిన బాలుడు మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన శృంగవరపుకోట మండలం చీడిపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఓ బాలుడు (16) ఇంటర్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద ఉండేవాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించాలని తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఇప్పుడు మైనర్‌వని, పెద్దయ్యాక పెళ్లి చేస్తామని వారు సర్ధిచెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చేతిలో పెద్ద కర్రపట్టుకొని గ్రామ వీధుల్లో తిరిగాడు. కనిపించిన కార్లు, ఆటోలు, బైకులు, ఇతర వస్తువులను ధ్వంసం చేశాడు. అడ్డుకునే యత్నంలో తండ్రికి కూడా గాయం అయింది. బాలుడిని అడ్డుకొనేందుకు స్థానికులు భయపడ్డారు. ఇళ్లల్లోకి దూరి తలుపులు వేసుకున్నారు. పోలీసులు గ్రామానికి వచ్చి అతికష్టంమీద బాలుడిని పట్టుకున్నారు. హెచ్చరించి వదిలిపెట్టారు. ఉదయం స్టేషన్‌కు రావాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం స్టేషన్‌కు రాకపోవడంతో పోలీసులు బాలుడి ఇంటికి వచ్చారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మరోలా చెబుతున్నారు. ‘గురువారం రాత్రి బాలుడి తండ్రికి ఒంట్లో బాగోలేకపోతే ఎస్.కోట ఆసుపత్రిలో చేర్పించారు. భార్య కూడా భర్తతో పాటు ఆస్పత్రిలో ఉండిపోయింది. శుక్రవారం ఉదయం కుమారుడికి ఎంత పోన్ చేసినా తీయకపోవడంతో భర్త వద్ద కుమార్తెను ఉంచింది. ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులోపల గడియ పెట్టి ఉంది. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగులగొట్టారు. బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈమేరకు కేసు నమోదు చేశాం’ అని సీఐ వి.నారాయణ మూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు.