Share News

The dangers of drunk driving మత్తులో ప్రయాణం పొంచి ఉన్న అపాయం

ABN , Publish Date - May 15 , 2026 | 12:14 AM

The dangers of drunk driving గత ఏడాది సెప్టెంబరులో పోలీసులు ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. 115 మంది పట్టుబడ్డారు. ఒక్కొక్కరికీ న్యాయస్థానం రూ.10 వేలు చొప్పున జరిమానా విధించింది. రూ.11.50 లక్షలు వసూలు కావడం అప్పట్లో సంచలనం. తరువాత డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

The dangers of drunk driving మత్తులో ప్రయాణం   పొంచి ఉన్న అపాయం

మత్తులో ప్రయాణం

పొంచి ఉన్న అపాయం

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వైనం

విస్తృతంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

అయినా తగ్గని మందుబాబులు

- గత ఏడాది సెప్టెంబరులో పోలీసులు ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. 115 మంది పట్టుబడ్డారు. ఒక్కొక్కరికీ న్యాయస్థానం రూ.10 వేలు చొప్పున జరిమానా విధించింది. రూ.11.50 లక్షలు వసూలు కావడం అప్పట్లో సంచలనం. తరువాత డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

- గత నెలలో పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. అతివేగం, మద్యం మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

- వారం కిందట విజయనగరం సమీపంలో తెల్లవారుజామున ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిపోయిన ఘటనలో బైక్‌పై ప్రయాణం చేస్తున్న ముగ్గురిలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల దృష్టికి వెళ్లకపోవడంతో ఈ ప్రమాదం వెలుగులోకి రాలేదు. ఇలాంటి ఘటనలెన్నో.

విజయనగరం, మే 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రావడం లేదు. మద్యం మత్తు కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నా వాహనదారులు వెనక్కి తగ్గడం లేదు. గాయాలతో బయటపడిన చాలా మంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఏం కాదులే అనుకుంటూ అపాయంలో పడుతున్నారు. అధికారికంగా 2024లో 5,853 కేసులు నమోదయ్యాయి. రూ.87.79 లక్షల అపరాధ రుసుం పోలీసులు వసూలు చేశారు. 2025లో 4,825 కేసులు నమోదుచేశారు. రూ.90.20 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాదికి సంబంధించి ఐదు నెలల కాలంలో 812 కేసులకుగాను రూ.8.70 లక్షలు అపరాధ రుసుం వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే గతంలో తక్కువ అపరాధ రుసుం విధించేవారు. ఇప్పుడు మొదటిసారి రూ.10 వేలు, రెండోసారి పట్టుబడితే జైలుశిక్ష తప్పనిసరి. రోడ్డు ప్రమదానికి కారకుడని తేలితే ఆరు నెలల జైలు, మృతికి కారణమైతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. లైసెన్స్‌ రద్దు వంటి చర్యలూ తీసుకుంటారు.

పటిష్ట చర్యలు చేపడుతున్నా..

జిల్లాలో ఒకవైపు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. న్యాయస్థానాలు కీలక ఆదేశాలు ఇస్తున్నాయి. జరిమానాలు, శిక్షల తీవ్రత పెరిగింది. అయినా చాలా మందిలో చలనం రావడం లేదు. హెల్మెట్‌ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందారు. 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది మృతిచెందితే..826 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 166 మంది మృతిచెందితే 695 మంది క్షతగాత్రులయ్యారు. 2025 లో 420 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 200 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 65 వేల మందికి ఈ-చలానాలు విధించారు. 35 వేల మంది నుంచి జరిమానాలు వసూలు చేశారు. ఓ 100 మందికి న్యాయస్థానాలు ఒకటి నుంచి వారం రోజుల పాటు జైలుశిక్షలు కూడా విధించాయి. దాదాపు లక్ష వరకూ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 274 వరకూ కేసులు నమోదయ్యాయి.

కఠిన చర్యలు తప్పవు

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్‌ పెట్టుకోవాలి. నిబంధనలు పాటించకపోతే ఎవరైనా సరే భారీ జరిమానాలు, జైలు శిక్షను ఎదుర్కోక తప్పదు.

- ఏఆర్‌ దామోదర్‌, ఎస్పీ, విజయనగరం

======

Updated Date - May 15 , 2026 | 12:14 AM