Share News

తుఫాన్‌ మిగిల్చిన నష్టం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:00 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

 తుఫాన్‌ మిగిల్చిన నష్టం
పాలకొండ-గోపాలపురం మధ్య చెరువును తలపిస్తున్న పంట పొలాలు

- జిల్లాలో మూడు రోజులు కురిసిన భారీ వర్షాలు

- ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు

- చెరువుల్లా మారిన పంట పంటలు

- నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- దెబ్బతిన్న రోడ్లు.. కూలిన ఇళ్లు

- కన్నీరుపెడుతున్న రైతులు

పార్వతీపురం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈదురుగాలుల ప్రభావానికి ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలు చెరువు లను తలపిస్తున్నాయి. మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల్లో వర్షపు నీరు చేరింది. వరద నీరు తగ్గకుంటే పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. కొండవాగులు, గెడ్డలు, సెలయేర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దెబ్బతిన్న రోడ్లు.. ఇళ్లు

సీతంపేట మండలంలోని గొయిది రోడ్డు, మక్కువ-మార్కొండపుట్టి రహదారి, కురుపాం నుంచి కొడిశ వెళ్లే రహదారులు దెబ్బతిన్నాయి. మరికొన్ని మండలాల్లో కూడా రోడ్లు ఛిద్రమయ్యాయి. మక్కువ మండలంలో ఒక పక్కా ఇళ్లు, మక్కువ, జియ్యమ్మవలస మండలాల్లో మూడు కచ్చా ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రం పార్వతీపురం జలమయమైంది. సౌందర్య థియేటర్‌ జంక్షన్‌తో పాటు థియేటర్‌ వెనుక భాగంలో ఉన్న ప్రాంతం పూర్తిగా ముంపునకు గురైంది. బెలగాం రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక సంక్షేమ హాస్టల్‌ ముంపునకు గురైంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని 75 మంది గర్భిణులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు అధికారులు తరలించారు.

విద్యుత్‌శాఖకు నష్టం..

ఈదురుగాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగి విద్యుత్‌ స్తంభాలపై పడ్డాయి. దీంతో పెద్ద సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు, కిలోమీటర్ల మేర విద్యుత్‌ తీగలు దెబ్బతిన్నాయి. సీతంపేట, పాలకొండ, కురపాం, జియ్యమ్మవలస, జీఎల్‌పురం, పార్వతీపురం, బలిజిపేట మండలాల్లో విద్యుత్‌ వ్యవస్థకు రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు ఏపీఈపీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ పి.త్రినాథరావు తెలిపారు. 33 కేవీ ఫీడర్లు 15, 11 కేవీ ఫీడర్లు, 70తో విద్యుత్‌ స్తంభాలు 198 వరకు దెబ్బతిన్నాయన్నారు. సిబ్బంది శ్రమించి గురువారం సాయంత్రానికి దాదాపు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. ఒక్క పాలకొండ మండలంలోనే పది వరకు విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా, కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్లు తెగిపడినట్టు ట్రాన్స్‌కో ఏఈ వాబ పేర్కొన్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు:కలెక్టర్‌

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సగటున 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, నేలకూలిన ప్రాంతాల్లో అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది కలిసి 15 నుంచి 30 నిమిషాల్లో రాకపోకలను పునరుద్ధరించారన్నారు. మరో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించి పాలకొండ, బలిజిపేటలో సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. చెరువుల నీటిమట్టాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. 9 మండలాల పరిధిలోని 45 చెరువుల్లో 28 అలర్ట్‌, ఆరు ఆర్నింగ్‌, 11 కాషన్‌ స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. బలిజిపేటలో 18, సీతంపేటలో పది చెరువులు వరదలకు ప్రభావితమయ్యాయని వెల్లడించారు. గండ్లు పడకుండా నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న 25 మట్టి ఇళ్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. కాజ్‌వేలు, వంతెనల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, చెరువు గట్లు రక్షణకు ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పార్వతీపురం బైపాస్‌ కాలనీలోని బాలుర హాస్టల్లోకి నీరు చేరడంతో 40మంది విద్యార్థులను సురక్షితంగా డైనింగ్‌ హాల్‌లోకి తరలించినట్లు తెలిపారు.

Updated Date - Sep 25 , 2026 | 12:00 AM