“The Crop Has Flourished!” ‘ పంట’ పండింది!
ABN , Publish Date - May 29 , 2026 | 10:52 PM
“The Crop Has Flourished!” ఏజెన్సీలో పసుపు పంట పండింది. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉండగా.. ధర కూడా గిట్టుబాటు కావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో గిరిజన రైతులు తమ పోడు వ్యవసాయంలో భాగంగా సేంద్రియ పద్ధతిలో పసుపును పండిస్తారు. అందుకే మన్యం పసుపునకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగిన వైనం
ఆనందంలో గిరిజన రైతులు
దళారుల బెడద తప్పించాలని విన్నపం
గుమ్మలక్ష్మీపురం, మే29(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో పసుపు పంట పండింది. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉండగా.. ధర కూడా గిట్టుబాటు కావడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో గిరిజన రైతులు తమ పోడు వ్యవసాయంలో భాగంగా సేంద్రియ పద్ధతిలో పసుపును పండిస్తారు. అందుకే మన్యం పసుపునకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమమవలస, సీతంపేట తదితర గిరిజన మండలాల్లో సుమారు నాలుగువేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. కాగా గతంలో కిలో పసుపు కొమ్ముల ధర రూ.120 ఉండేది. ప్రస్తుతం రూ.150కు చేరింది. దుంప రూపంలో ఉండే నాణ్యమైన పసుపును స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా నీలకంఠాపురం, గుమ్మలక్ష్మీపురం, మొండెంకల్, కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సీతంపేట, పాచిపెంట, మక్కువ, సాలూరు గ్రామాల్లోని పసుపు పంటను స్థానిక వర్తకులు సేకరించి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ర్టాలకు తరలిస్తారు. ఔషధ గుణాలు కలిగిన మన్యం పసుపును ఆయుర్వేద కంపెనీలు కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే ఈ ప్రాంత పసుపునకు డిమాండ్ పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పంట దిగుబడులు , ధర ఆశాజనకంగా ఉన్నా.. దళారుల బెడద తప్పడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ ఏటా స్థానిక వర్తకులకు చెప్పిన ధరకే పసుపు పంటను అమ్మాల్సి వస్తుంది. జీసీసీ, వెలుగు, ఐటీడీఏల ద్వారా గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.’ అని వారు కోరుతున్నారు. ఉత్పత్తి సేకరణ, మార్కెటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఏజెన్సీలో పసుపు పంటకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని గిరిజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఈ ప్రాంత గిరిజనులు పోడు వ్యవసాయంలో పసుపును పండిస్తుంటారు. వారిని ప్రోత్సహించడానికి తగిన ప్రయత్నం చేస్తాం. మా ఉన్నతాధికారులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.’ ఐటీడీఏ ప్రాజెక్టు వ్యవసాయాధికారి పి.శంకరరావు, జీసీసీ మేనేజర్ రాము తెలిపారు.