పంట రైతుది.. లాభం దళారులది
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:09 AM
కూరగాయలు, ఆకుకూరల రైతులను దళారులు, వ్యాపారులు సిండికేటై దోచుకుంటున్నారు.
- తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయం
- మార్కెట్లో రేట్లు బాగున్నా రైతులకు దక్కని ఫలితం
- సిండికేటై దోచుకుంటున్న దళారులు, వ్యాపారులు
రాజాం రూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కూరగాయలు, ఆకుకూరల రైతులను దళారులు, వ్యాపారులు సిండికేటై దోచుకుంటున్నారు. మార్కెట్లలో వారు ఏ రేటు చెబితే రైతు ఆ ధరకే ఇచ్చి ఇంటిబాట పడుతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి బహిరంగా మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు ఆశించిన ధరలు రాక రైతులు దిగాలు పడుతుంటే దళారులు మాత్రం లాభాలు పొందుతున్నారు. రైతుబజార్ల వద్ద కూడా రైతులకు బదులు వ్యాపారులే తిష్టవేసి అధిక లాభాలార్జిస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి..
కూరగాయలు, ఆకుకూరల అమ్మకాలకు రాజాం మార్కెట్ అనుకూలంగా ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో రైతులు ఇక్కడికి వస్తుంటారు. రాజాం మండలంలోని గెడ్డవలస, గార్రాజు చీపురుపల్లి, బొమ్మినాయుడు వలస, పెనుబాక, బొద్దాం, సోపేరు తదితర గ్రామాల రైతులతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, మెరకముడిదాం, తెర్లాం, శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలాల రైతులు తమ పంటలను రాజాం మార్కెట్‌కు తీసుకువస్తారు. అదే విధంగా శ్రీకాకుళం, పొందూరు, పాలకొండ తదితర పట్టణాల నుంచి దళారులు, హోల్‌సేల్ వ్యాపారులు వాహనాలతో వచ్చి వేకువజామున నాలుగు గంటల నుంచే రాజాం మార్కెట్లో తిష్ట వేస్తారు. 25 కేజీల వంకాయల బస్తాను రైతుల నుంచి సుమారుగా రూ.900 నుంచి రూ.1000కి కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో అదే బస్తాను రూ.1800 నుంచి రూ.2వేలకు అమ్మకం చేస్తున్నారు. రైతుల నుంచి ప్రతి పంటనూ కిలో రూ.40 నుంచి రూ.50కి కొనుగోలు చేసి వాటిని రూ.70 నుంచి రూ.90 వరకూ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా రైతాంగానికి ఒరిగేదేమీ కనిపించడం లేదు. కూరగాయల రైతులకు రాజాం తప్ప అమ్ముకునేందుకు ఆ చుట్టుపక్కల మార్కెట్ సదుపాయం లేదు. దీంతో చేసేది లేక దళారులు, వ్యాపారులు అడిగిన ధరకు పంటను విక్రయించి ఇంటిబాట పడుతున్నారు.
పెరిగిన ధరలు..
ఎల్‌నినో ప్రభావం కూరగాయలు, ఆకుకూరల ధరలపై తీవ్రంగా చూపుతోంది. కొనేందుకు వెళ్లేవారంతా ధరలు చూసి నిర్ఘాంతపోతున్నారు. పైగా ఈ రోజు ఉన్నధర మరుసటి రోజు ఉండడంలేదు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. రూ.500 నోటు పట్టుకుని వెళ్తే ఐదారు కిలోల కూరగాయలు కూడా రాని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వంకాయలు రూ.80, టమాటా రూ.60, ఉల్లి రూ.60, బల్లచిక్కుడు కాయలు రూ.80, పొడవు చిక్కుళ్లు రూ.60, బీరకాయలు రూ.80, బెండ, దొండ కాయలు రూ.60, నాటు అంగాకరకాయలు రూ.180, హైబ్రిడ్‌రకం రూ.130, కేబేజీ బుట్ట రూ.60, బెండకాయలు రూ.60, బీన్స్ రూ.140, బీట్‌రూట్ రూ.60, క్యారెట్ రూ.60, బంగాళా దుంపలు రూ.40, కిలో కాకరకాయలు రూ.50 పలుకుతున్నాయి. చిన్న ఆనపనకాయ ధర రూ.30 కాగా, పచ్చిమిర్చి, అల్లం ధరలు కూడా అల్లాడిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు సతమతమవుతున్నారు.
గత్యంతరం లేక..
మూడెకరాల భూమిలో వంగ, బీర, చిక్కుళ్లు, టమాటా, గోంగూర, తోటకూర పండిస్తున్నాను. నేలబావి ఉండడంతో దిగుబడి బాగున్నా మార్కెట్లో ఆశించిన ధరలు రావడం లేదు. బొబ్బిలి మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉన్నా రాజాం దగ్గర కావడంతో మాఊరితో పాటు పరిసర పది గ్రామాల రైతులంతా రాజాం వెళ్తాం. గత్యంతరం లేక దళారులు, హోల్‌సేల్ వ్యాపారులకే అమ్మాల్సి వస్తుంది.
-రామినాయుడు, రైతు, వెలగవలస, తెర్లాం మండలం.