Peaceful పురపోరు ప్రశాంతం
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:25 AM
The Civic Battle Is Peaceful పురపోరు ముగిసింది. జిల్లాలోని మూడుచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం ఓటు గుర్తింపు కార్డు లేదా ఆధార్‌కార్డు, ఓటరు స్లిప్పుతో వచ్చిన వారికి మాత్రమే పోలీసులు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు.
9 గంటల తర్వాత కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
68.04 శాతంగా ఓటింగ్ నమోదు.. రేపు కౌంటింగ్
పార్వతీపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పురపోరు ముగిసింది. జిల్లాలోని మూడుచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం ఓటు గుర్తింపు కార్డు లేదా ఆధార్‌కార్డు, ఓటరు స్లిప్పుతో వచ్చిన వారికి మాత్రమే పోలీసులు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. కాగా ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరిగింది. అన్నిచోట్లా ఓటర్లు పోటెత్తారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహంగా కేంద్రాలకు తరలివచ్చారు. వృద్ధులతో పాటు దివ్యాంగులు తదితరులు కుటుంబ సభ్యుల సహకారంతో కేంద్రాలకు వచ్చారు. కొన్నిచోట్ల పోలీసులు వారికి సహకరించారు. యువత కూడా పెద్దఎత్తున కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులు తమ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాలూరులో 23వ వార్డులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , పార్వతీ పురంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. వారితో పాటు పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాల కొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ గ్రీష్మ, చైర్‌పర్సన్ అభ్యర్థులు ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. సుమారు 800 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. జిల్లాలో 106165 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 71,933 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 33959 మంది పురుషులు , 37974 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పోలింగ్ శాతం 68.04గా నమోదైంది. అయితే అంతా ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా మంగళవారం ఆయా పురపాలక సఘాల పరిధిలో ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
వార్డుల విభజనతో ఇక్కట్లు
పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీల్లో వార్డుల విభజన కారణంగా కొంతమంది ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యుల్లో భార్యకు ఒక చోట, భర్తకు మరో చోట పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో నానా అవస్థలు పడ్డారు.
బతికి ఉండగానే చంపేశారు...
పార్వతీపురంలో ఒకటో వార్డుకు చెందిన పల్లి రెడ్డి అరుణకుమారి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా.. ఓటర్ల జాబితాలో ఆమె చనిపోయినట్టు ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆమెను ఓటు వేసేందుకు అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
సీఐతో వైసీపీ అభ్యర్థి మేనల్లుడు వాదన...
పార్వతీపురంలో 34 వార్డుల్లో వైసీపీ అభ్యర్థి సోదరి క్యూలైన్‌లో ప్రచారం చేశారు. దీనిపై టీడీపీ అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో సీఐ వెంకటరావు స్పందించి వెంటనే ఆమెను అక్కడ నుంచి పంపించేశారు. అదే సమయంలో ఆమె కుమారుడు సీఐతో వాదన చేశారు. వెంటనే వైసీపీ అభ్యర్థి అక్కడకు చేరుకుని తన మేనల్లుడిని మందలించి అక్కడి నుంచి పంపించేశారు.
మద్దతుదారుల మధ్య స్వల్ప వివాదం
సాలూరు పురపాలక సంఘంలో రెండు, ఆరు, ఏడు వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, జనసేన, వైసీపీ కౌన్సిలర్లు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను పంపించేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ర్యాంపులు, ట్రైసైకిళ్లు లేక..
పార్వతీపురంలోని 10వ వార్డు నవిరి కాలనీలో ఒక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2, 4, 35 వార్డుల్లో దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం ర్యాంప్‌లు, ట్రై సైకిళ్లను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైద్య శిబిరాలు..
పార్వతీపురం జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా శిబిరాన్ని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి పరిశీలించారు. సాలూరు, పాలకొండలో ఏర్పాటు చేసిన శిబిరాలను ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించారు.
కేంద్రాల పరిశీలన
- పార్వతీపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి పరిశీలించారు. తాగునీరు, నీడ, లైటింగ్, దివ్యాంగులు కోసం ర్యాంప్‌లు తదితర సౌకర్యాలను తనిఖీ చేశారు.
-సాలూరు: సాలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ సచిన్ రహర్ తదితరులు ఉన్నారు.
- పాలకొండ: పాలకొండ పట్టణంలోని బాలికల హైస్కూల్, కస్పావీధిలో పోలింగ్ కేంద్రాలు, ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్‌లో స్ర్టాంగ్ రూమ్‌ను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, సజావుగా పోలింగ్ ప్రక్రియ సాగిందని ఆయన తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామన్నారు. మరోవైపు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ చిన్నరాముడు, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, పాలకొండ కమిషనర్ (ఆర్‌వో) రాజు పోలింగ్‌ను పర్యవేక్షించారు. వెబ్‌కాస్టింగ్ స్ర్కీన్‌ల ద్వారా కూడా పరిశీలించారు.
పార్వతీపురం టౌన్: పట్టణంలోని 1, 2, 11, 34 వార్డుల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు.
అర్ధాకలితో ఎన్నికల సిబ్బంది
పార్వతీపురం టౌన్: మున్సిపాల్టీలోని పోలింగ్ సిబ్బందికి అర్ధాకలి తప్పలేదు. ఆదివారం ఉదయం చాలీచాలని అల్పాహారం అందించారు. మధ్యాహ్నం కూడా రుచి లేని ఆహారాన్ని అందించారని పలు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది, ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ బి.రామ్ గోపాల్‌ను వివరణ కోరగా ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బందికి రుచికరమైన అల్పాహరం, భోజనాన్ని అందించామన్నారు.
ఓటింగ్ ఇలా..
- పార్వతీపురం టౌన్ : పార్వతీపురంలోని 36 వార్డులు ఉండగా 63 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తరలివచ్చారు. మున్సిపాల్టీలోని 40,765 మంది ఓటర్లు ఉండగా 25,936 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ తీవ్రత పెరిగినా.. ఎవరూ పట్టించుకోలేదు. యువత, వృద్ధులు క్యూలైన్లలో వేచి ఉండి ఓట్లు వేశారు. మొత్తంగా 63.62 శాతం పోలింగ్ జరగ్గా.. గత ఎన్నికలతో పోలిస్తే.. 1.62 శాతం ఎక్కువని అధికారులు చెబుతున్నారు.
- సాలూరు: సాలూరులో 32 వార్డులు ఉండగా.. 62 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 41,934 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 12,878, మహిళలు 14,647, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు కేవలం 20 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 12 గంటల నుంచి 2 గంటల వరకు 50 శాతం, సాయంత్రం ఐదు గంటలకు 65.64 శాతం మేర పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. సుమారు 200 మందికిపైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
- పాలకొండ: నగర పంచాయతీ పరిధిలో 28 వార్డుల్లో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23,466 మంది ఓటర్లు ఉండగా వీరిలో 12,012 మంది మహిళలు, 11,453 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఆదివారం 16,344 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.65 శాతం మేర ఓటింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు. వారిలో మహిళలు 8,487 మంది, పురుషులు 7,857 మంది ఓటు వేశారు. 2021-26 ఎన్నికల్లో 71 శాతం మేర ఓట్లు పోలవ్వగా ప్రస్తుతం 69.65 పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 11 గంటలకు 26.32 శాతం , ఒంటి గంటకు 44.46 శాతం , మూడు గంటలకు 58 శాతం మేర పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే 1.35 శాతం మేర ఓటింగ్ శాతం తగ్గింది.
స్ర్టాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు
బెలగాం/పాలకొండ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులతో సంతకాలు చేయించుకుని బ్యాలెట్ బాక్సులను సీల్ చేశారు. అనంతరం పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూమ్‌కు పటిష్ఠ పోలీస్ బందోబస్తు మఽధయ బ్యాలెట్ బాక్సులకు తరలించారు. నిఘా నీడలో వాటిని భప్రదరిచారు. ఇక పాలకొండ పోలింగ్ కేంద్రాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ర్టాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులను తరలించారు. ఈప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. సాలూరులో బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ర్టాంగ్ రూమ్‌లకు తరలించారు.
గెలుపు అంచనాల్లో అభ్యర్థులు
పార్వతీపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పురాల్లో పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఎవరికి వారే మెజార్టీపై అంచనాలు వేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటలే ఉండడంతో విజయావకాశాలపై చర్చించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ శాతం తదితర విషయాలను లెక్కిస్తున్నారు. అయితే చాలాచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. పార్వతీపురంలోని సుమారు 26 వార్డుల్లో సైకిల్ జోరు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మిగిలిన పది వార్డుల్లోని రెండు వార్డుల్లో స్వతంత్య్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థికి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. ఇక సాలూరులో టీడీపీ జనసేన అభ్యర్థి, స్వతంత్య్ర అభ్యర్థి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే స్వతంత్య్ర అభ్యర్థికే విజయం వరిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సాలూరులో మంత్రి వర్గమంతా ఇండిపెండెంట్ అభ్యర్థి వైపు, ఇక జనసేన పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి వెంట టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్గం ఉన్నట్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే.. పాలకొండలో జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి విజయం ఖాయంగా ఉంది.