నగరం త్రివర్ణమయం
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:29 PM
నగరం త్రివర్ణమయం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు జిల్లా కేంద్రం విజయనగరంలో శుక్రవారం వేలాది మంది జాతీయ జెండాలను చేతపట్టి హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
- ఘనంగా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ
-150 అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన
- ప్రతి ఇంటిపై జెండా ఎగరాలని మంత్రి కొండపల్లి పిలుపు
విజయనగరం టౌన్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నగరం త్రివర్ణమయం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు జిల్లా కేంద్రం విజయనగరంలో శుక్రవారం వేలాది మంది జాతీయ జెండాలను చేతపట్టి హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కోటకూడలి వద్ద ఈ ర్యాలీని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అక్కడ నుంచి గంటా స్తంభం వరకూ సాగింది. నగరానికి చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, యువ క్రీడాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్లు భాగస్వాములయ్యారు. అంతా 150 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. జాతి ఐక్యత, దేశభక్తిని చాటడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకు హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. యువతే దేశానికి వెన్నెముక అని అన్నారు. కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి మాట్లాడుతూ.. ఒక్క పిలుపుతో వేలమంది ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడమే కాకుండా ప్రతీ పౌరుడిలో దేశభక్తి భావనను మరింత బలపరిచే గొప్ప కార్యక్రమం హర్‌ఘర్ తిరంగా ర్యాలీ అని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ బాలాస్వామి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, డీఎస్‌డీవో ఎస్.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ పాణిగ్రాహి, డీఈఆర్వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు