కొండెక్కిన కోడి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:00 PM
మార్కెట్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత కొద్ది రోజులుగా వీటి ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
- పెరిగిన చికెన్ ధరలు
- స్కిన్‌లెస్ కిలో రూ.340
గజపతినగరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత కొద్ది రోజులుగా వీటి ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ (స్కిన్‌లెస్) ధర రూ.340 పలికింది. వారం రోజుల కిందట ఈ ధర రూ.260 వరకు ఉండేది. ఒకేసారి ధర పెరగడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ కోడి కిలో (స్కిన్) రూ.320, (స్కిన్ లెస్) రూ.340, పేరెంట్స్ కోడి (స్కిన్) రూ.300, (స్కిన్‌లెస్) కిలో 320కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పౌలీ్ట్ర పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలు చికెన్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వేసవి కావడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కోళ్లు మరణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని పౌలీ్ట్రలో ఆశించినంత కోళ్లు లేకపోవడంతో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారం సాగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గతంలో ఇంత ధర ఎప్పుడూ పెరగలేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.