Share News

మారనున్న ‘ఉపాధి’

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:33 PM

ఇక నుంచి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) స్వరూపం మారనుంది.

 మారనున్న ‘ఉపాధి’
సీతంపేట ఏజెన్సీలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

- ఈ నెలాఖరు వరకే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌

- ఏప్రిల్‌ నుంచి ‘వీబీజీ రామ్‌జీ’ చట్టం అమలు

- తగ్గనున్న కేంద్ర నిధుల వాటా

- ఒక పంచాయతీకి 20 పనులే పరిమితం

- గడువు సమీపిస్తుండడంతో ఊపందుకున్న నిర్మాణాలు

సీతంపేట రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) స్వరూపం మారనుంది. దీని స్థానంలో కేంద్రం ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. ఇందులో భాగంగా కేంద్రం ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు అభివృద్ధి పనులకు పెద్ద ఆటంకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద చేపట్టే పనులకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 90 శాతం నిధులను చెల్లిస్తుంది. మిగతా 10 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్ల నిధులకు కొరత ఉండకపోవడంతో పనులు వేగవంతంగా జరిగేవి. అయితే, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్తగా అమలు చేయనున్న వీబీజీ రాంజీ చట్టం ద్వారా చేపట్టబోయే పనులకు కేంద్రం 60శాతం నిధులే ఇవ్వనుంది. మిగతా 40శాతం నిధులను రాష్ట్రం భరించాల్సిందే. సకాలంలో ఈ నిధులు ఖర్చు చేయకపోతే మురుగుపోయే పరిస్థితి ఏర్పడనుంది. అంతేకాకుండా గతంలో పంచాయతీల వారీగా ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్న ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరయ్యేవి. ఇకనుంచి ఏ పంచాయతీకైనా కేవలం 20పనులు మాత్రమే లభించనున్నాయి. దీంతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

శరవేగంగా పనులు..

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం పేరు మార్పు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలోని నిబంధనల మేరకు గ్రామాల్లో జరుగుతున్న పనులన్నీ ఈ నెల 15 నాటికి పూర్తిచేసి సంబంధిత బిల్లులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాల్లో బీటీ, సీసీ రహదారులు, కాలువలు, గోకులాలు వంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.214కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.114కోట్ల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. సీతంపేట ఏజెన్సీలో మొత్తంగా 1200 ఉపాధి హామీ పథకం వేతన గ్రూప్‌లు ఉండగా, 3వేల మందికి పైగా వేతనదారులు పనులు చేస్తున్నారు. సీతంపేట మండలంలో 166 పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, బిల్లులపై కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద చేపట్టిన పనులకు ఇంతవరకు బిల్లుల చెల్లింపు జరగలేదు. మరోపక్క సగంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తిచేయకపోతే ఎక్కడ నిధులు వెనక్కి వెళ్లిపోతాయోనని ఆందోళన వారిలో నెలకొంది. ఈ విషయమై ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీడీ శ్రీహరిని వివరణ కోరగా.. ‘ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉపాధి నిధులతో సీసీ, బీటీ రహదారులు, కాలువల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 15 నాటికి పనులు పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఆ దిశగా ముందుకు వెళుతున్నాం. ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’అని పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:33 PM