మారనున్న నగర స్వరూపం
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:46 PM
విజయనగరం నగరపాలక సంస్థ స్వరూపం మారనుంది. ఇప్పటి వరకు 50 డివిజన్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 12 డివిజన్లు పెరిగాయి.
- 50 నుంచి 62కు పెరిగిన డివిజన్లు
- జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- ఆశావహుల్లో ఆనందం
విజయనగరం టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ స్వరూపం మారనుంది. ఇప్పటి వరకు 50 డివిజన్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 12 డివిజన్లు పెరిగాయి. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 62కు చేరనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీవోను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని దానికి 10 శాతం జనాభాను కలిపి డిజిజన్ల సంఖ్యను పెంచినట్లు జీవోలో పేర్కొంది. దీనిప్రకారం విజయనగరం నగరపాలక సంస్థ జనాభా 2011లో 2,44,598 మంది ఉన్నారు. దీనికి పది శాతం కలిపితే 2.69లక్షలకు పైగా జనాభా అవుతుంది. ఈ లెక్కన నగరంలో డివిజన్లు 50 నుంచి 62కు పెరగనున్నాయి.
ఇదీ ప్రస్థానం..
విజయనగరం మున్సిపల్ ప్రస్థానం 1888లో మొదలైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో మున్సిపల్ అసోసియేషన్ ఏర్పడింది. ఆ తరువాత వివిధ పార్టీల ఆధారంగా 1974లో తొలి మున్సిపల్ ఎన్నికలు 27 వార్డులకు జరిగాయి. 1971వరకు సోషల్‌గ్రేడ్ మున్సిపాల్టీగా ఉండేది. 1998లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారింది. 40 వార్డులుగా విభజించారు. 2019లో నగరపాలక సంస్థగా మారింది. 50 డివిజన్లను చేసి 2020లో ఎన్నికలను నిర్వహించారు. తాజాగా 62 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
2020లో నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు వార్డులు విభజన జరిగింది. విభజన సహేతుకంగా లేదనే విమర్శలు వినిపించాయి. సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో అప్పటివరకూ ఒకే డివిజన్లలో ఉన్న జనాభాను మూడు డివిజన్లలోకి సర్దాల్సి వచ్చింది. ఉదాహరణకు 50వ డివిజన్‌లోని కొన్ని నివాసాలను 44వ డివిజన్‌లోకి, మరికొన్ని నివాసాలను 43వ డివిజన్‌లోకి మార్చాల్సి వచ్చింది. కేఎల్‌పురంలో ఉన్న ఒకే ప్రాంతాన్ని అడ్డదిడ్డంగా విభజించి మూడు డివిజన్లకు సర్దుబాటు చేశారు. దీంతో స్థానికులతో పాటు నాయకులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పెరుగుతున్న డివిజన్ల వల్ల కేఎల్‌పురం, అయ్యన్నపేట, వీటీ అగ్రహారం, గాజులరేగ వంటి కొన్ని శివారు ప్రాంతాల్లో సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది.
ప్రస్తుతం 50 డివిజన్లలో 2,02,154 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 99,012 మంది, మహిళా ఓటర్లు 1,03,117 మంది ఉన్నారు. ఇతరులు 25మంది ఉన్నారు. అత్యధికంగా 39వ డివిజన్‌లో 5,814మంది ఓటర్లు ఉన్నారు.
కసరత్తు ప్రారంభిస్తాం
నగరపాలక సంస్థలో డివిజన్లను పెంచాలని ప్రభుత్వం జీవో విడదల చేసింది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 62కు పెంచేందుకు కసరత్తు ప్రారంభిస్తాం. ఇప్పటికే దీనిపై ఒక అవగాహనకలిగి ఉన్నాం.
-బాలాస్వామి, కమిషనర్, నగరపాలక సంస్ధ విజయనగరం