నెలాఖరులోగా జనగణన పూర్తి చేయాలి
ABN , Publish Date - May 22 , 2026 | 11:30 PM
ఈనెలాఖరులోగా జనగణన ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని, దీనిలో ఎలాంటి అలసత్వానికి తావుండకూడదని ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు.
- ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్
విజయనగరం, కలెక్టరేట్ మే 22 (ఆంధ్రజ్యోతి): ఈనెలాఖరులోగా జనగణన ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని, దీనిలో ఎలాంటి అలసత్వానికి తావుండకూడదని ఇన్‌చార్జి కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఆయా శాఖ అధికారులుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా జనగణనను ముగించడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆయా ఇళ్లను మరోసారి సందర్శించి అక్కడ నివశించే వారి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని కూడా గుర్తించి వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, అనాథ శరణాలయాలు, ఆశ్రమాలు తదితర చోట్లకు వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ప్రతి ఇళ్లు, ప్రతి ఒక్క వ్యక్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో చందక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.