నామినేషన్ల సందడి
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:09 AM
నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా రెండోరోజు శనివారం నామినేషన్లు జోరందుకున్నాయి.
రెండోరోజు కార్పొరేషన్లో దాఖలు చేసిన 174 మంది
నేటితో ముగియనున్న గడువు
విజయనగరం టౌన్, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా రెండోరోజు శనివారం నామినేషన్లు జోరందుకున్నాయి. తొలిరోజు కేవలం 19మంది మాత్రమే నామినేషన్లు వేయగా రెండోరోజు 62 డివిజన్ల నుంచి 174 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అధిక సంఖ్యలో ఆశావహులు సిద్ధమౌవుతున్నారు. మేయర్ అభ్యర్థిత్వానికి ఏడుగురు నామినేషన్లు వేయగా, వార్డు మెంబర్లుగా 167మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 17 కౌంటర్ల ద్వారా నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరుగుతోది. నామినేషన్ల ప్రక్రియను ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ వెంకటరమణమూర్తి, కమిషనర్ బాలాస్వామి పరిశీలిస్తున్నారు.
మేయర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి తొలిరోజు కోలగట్ల శ్రావణి నామినేషన్ వేయగా రెండోరోజు జనసేనకు చెందిన గురాన రాధిక నామినేషన్ దాఖలు చేశారు. అమ్ఆద్మీపార్టీ నుంచి కోట సునీత కూడా నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి మేయర్ టిక్కెట్ ఖరారు అయ్యిన అవనాపు భార్గవి నామినేషన్ ఆదివారానికి వాయిదా పడినట్లు సమాచారం.
అమ్ఆద్మీ పార్టీ నుంచి కార్పొరేటర్ల బరిలో శనివారం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 46వ డివిజన్ నుండి బి.బార్గవి, 56వ డివిజన్ నుండి ఎస్.ఈశ్వర్, 35వ డివిజన్ నుండి అంబేద్కర్, 58వ డివిజన్ నుంచి డా.పైల కుమార్, 47వ డివిజన్ నుంచిబూరాడ శ్రీనివాసరా వు నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లిమర్ల నగర పంచాయతీలో 65 దాఖలు
నెల్లిమర్ల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీలో కూడా ఎన్నికల నామినేషన్ల పర్వం రెండోరోజు కొనసాగింది. శనివారం స్థానిక కార్యాలయంలో ఆయా పార్టీల అభ్యర్థులు 65 నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్ పదవికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీకి చెందిన నాయకులు జనాప్రసాద్, రవ్వా నాని రెబల్స్ అభ్యర్థులుగా చైర్మన్ స్థానానికి నామినేషన్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 63 నామినేషన్లు వేశారు. పార్టీల వారీగా టీడీపీ నుంచి 32 మంది, వైసీపీ నుంచి 13 మంది, జనసేన నుంచి 16 మంది, ఇండిపెండెంట్లుగా ఇద్దరు వేశారు. టీడీపీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంజి స్వాతికి మద్దతుగా టీడీపీ నాయకులు లెంక అప్పలనాయుడు, ఆల్తి శ్రీను, అట్టాడ శ్రీధర్ పాల్గొన్నారు.
బొబ్బిలిలో 83 నామినేషన్లు
బొబ్బిలి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థులుగా పోటీ చేయ నున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం నామినే షన్లను దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి రాంబార్కి రేణుకాదేవి స్వప్న భర్త శరత్బాబుతో కలిసి మున్సి పల్ కార్యాలయానికి పాదయాత్రగా వచ్చి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్ము నాయుడు, జనసేన ఇన్చార్జి గిరడ అప్పలస్వామి, టీడీపీ సీనియర్ నేతలు రాంబార్కి శరత్బాబు, పువ్వల శ్రీనివాసరావు, గెంబలి శ్రీనివాస రావు, పెంట స్వామినాయుడు, కింతలి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ తరపున చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
చెరో వార్డుకు భార్యాభర్తల నామినేషన్లు
బొబ్బిలి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, ఆయన సతీమణి చెలికాని స్వప్న(మాజీ కౌన్సిలరు)లు చెరో వార్డుకు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మల్లమ్మపేట గ్రామా నికి చెందిన సీనియర్ మాజీ కౌన్సిలరు ఇంటి గోవిందరావు, ఆయన సతీమణి లక్ష్మి కూడా చెరో వార్డులకు ఇండిపెండెం ట్లుగా నామినేషన్ వేశారు.