Share News

ఆక్రమణదారుల బరితెగింపు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:25 AM

మండలంలోని చోడమ్మ అగ్రహారంలో భూ ఆక్రమణదారులు బరితెగించారు.

ఆక్రమణదారుల బరితెగింపు
తమను బెదిరించారని చెబుతున్న ఆర్‌ఐ మాధురి, వీఆర్వో గౌషి

- అగ్రహారం భూకబ్జా వ్యవహారంలో అధికారులకు బెదిరింపులు

- మహిళలు అని కూడా చూడకుండా దుర్భాషలు

- పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న తహసీల్దార్‌

- దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు

పూసపాటిరేగ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని చోడమ్మ అగ్రహారంలో భూ ఆక్రమణదారులు బరితెగించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా అధికారులను బెదిరించారు. మహిళలు అని కూడా చూడకుండా తమను దుర్భాషలాడారంటూ స్థానిక వీఆర్వో గౌషి, ఆర్‌ఐ మాధురి వాపోయారు. అసభ్యకర పదజాలం వాడారని, ఈ భయం కారణంగానే తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డామని వారు భోరుమన్నారు. ఈవిషయమై తహసీల్దార్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. తమ ఉద్యోగుల విధి నిర్వహణకు అడ్డుపడిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకొనేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై తమ సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ తెలిపారు.

పాత్రికేయుల ఆందోళన..

భూ ఆక్రమణకు సంబంధించి విలేకరి పందిరిపల్లి గోవిందుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. భూఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Aug 21 , 2026 | 12:25 AM