Share News

కమాండ్‌ పాటిస్తే బ్రెయిన్‌ భద్రం

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:12 AM

మెదడు మన శరీరానికి కమాండ్‌ సెంటర్‌ లాంటిది. తలనొప్పి, చేయి లేదా కాలు బలహీనపడడం, మాట తడబడడం, చూపు మందగించడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా తీసుకోవద్దు. ఇది స్ట్రోక్‌ లేదా ఇతర నాడీ సంబంధిత వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.

కమాండ్‌ పాటిస్తే బ్రెయిన్‌ భద్రం

  • కమాండ్‌ పాటిస్తే బ్రెయిన్‌ భద్రం

  • ప్రారంభ సంకేతాలను తేలిగ్గా తీసుకోవద్దంటున్న నిపుణులు

  • నిర్లక్ష్యం వీడితే మెదడు భద్రం

  • మొబైల్‌ స్ర్కీన్‌ టైం తగ్గించాల్సిందే

  • వ్యాయామం.. సమతుల ఆహారం కీలకం

  • నేడు ప్రపంచ మస్తిష్క దినోత్సవం

మెదడు మన శరీరానికి కమాండ్‌ సెంటర్‌ లాంటిది. తలనొప్పి, చేయి లేదా కాలు బలహీనపడడం, మాట తడబడడం, చూపు మందగించడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా తీసుకోవద్దు. ఇది స్ట్రోక్‌ లేదా ఇతర నాడీ సంబంధిత వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. సమయానికి ఆసుపత్రికి చేరుకుంటే అనేక సందర్భాల్లో ప్రాణాలను కాపాడడంతో పాటు శాశ్వత వైకల్యాన్ని నివారించే అవకాశం వుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వీడితే మెదడు భద్రమని చెబుతున్నారు.

విజయనగరం రింగురోడ్డు, జూలై 21(ఆంధ్రజ్యోతి): విజయనగరానికి చెందిన 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థి నాగరాజు రోజూ 8 నుంచి 10 గంటలు మొబైల్‌లో రీల్స్‌, గేమ్స్‌, సోషల్‌ మీడియాతో గడిపేవాడు. కొద్ది కాలానికే నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు వైద్యునికి చూపించారు. వెంటనే మొబైల్‌ స్ర్కీన్‌ టైం పూర్తిగా తగ్గించి వ్యాయామం, క్రమబద్ధమైన నిద్ర అలవాటు చేయాలని చెప్పారు. ఇప్పుడిప్పుడే అతని ఆరోగ్యం కుదుట పడుతోంది.

- నగరానికి చెందిన 42ఏళ్ల ఉద్యోగి సోములుకు ఒక రోజు అకస్మాత్తుగా కుడిచేయి బలహీనంగా మారడం, మాట తడబడడం గమనించాడు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడంతో ఇలా జరిగిందని భావించి కుటుంబ సభ్యులు కొన్ని గంటలు వేచి చూశారు. పరిస్థితి మరింతగా విషమించడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా అది స్ర్టోక్‌గా నిర్ధారించారు. అయితే సమాయానికి చికిత్స అందడంతో పూర్తిగా కోలుకొని తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చాడు. స్ట్రోక్‌ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ.

మనిషి శరీరాన్ని నియంత్రించే ప్రధాన అవయవం మెదడు. ఆలోచన, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు, భావోద్వేగాలు, మాట, కదలికలు, శ్వాస వంటి అనేక కీలక కార్యకలాపాలకు మెదడే కేంద్ర బిందువు. అలాంటి మెదడు ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూలై 22న ప్రపంచ మస్తిష్క (బ్రెయిన్‌ డే) దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రోక్‌ (పక్షవాతం), అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌, మూర్చ వ్యాధి, మెదడులో కణితులు, మైగ్రేన్‌, నరాల బలహీనత వంటి వ్యాధులు జిల్లాలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో జ్ఞాపకశక్తి సమస్యలు ఎక్కువగా కన్పిస్తుండగా, యువతలో కూడా స్ట్రోక్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్‌, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు అఽధికంగా కంప్యూటర్లు లేదా స్మార్ట్‌ఫోన్లతో గడపడం వంటి కారణాలు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌తో మప్పు

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌..ఇప్పుడు మెదడుపై మెల్లగా ప్రభావం చూపుతున్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి మొబైల్‌లో సోషల్‌ మీడియా,వీడియోలు, గేమ్స్‌లో మునిగిపోవడం రాత్రళ్లు నిద్ర లే కుండా స్ర్కీన్‌ల ముందే గడపడం పెరుగుతున్న మానసిక ఒత్తిడి ఆనారోగ్య జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మెదడు, నాడీవ్యవస్థ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి.

స్ట్రోక్‌ సంకేతాలు కావొచ్చు

ఆకస్మాత్తుగా చేయి లేదా కాలు బలహీనపడడం,ముఖం ఒకవైపు వంగిపోవడం, మాట తడడబడడం, చూపు మందగించడం తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే చాలామంది వాటిని సాధారణ ఒత్తిడి లేదా ఆలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని ఇవి స్ట్రోక్‌ సంకేతాలు కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమాయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తే అనేక మంది పూర్తిగా కోలుకునే అవకాశం వుందని వైద్యులు చెబుతున్నారు.

మెదడును కాపాడుకోవాలంటే

రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర, సమతుల ఆహారం తీసుకోవడం, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో వుంచడం, యోగా, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్‌, చెస్‌ వంటి మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా మెదుడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయామం.. నిద్ర.. ఆహారం కీలకం: డాక్టరు రెడ్డి శంకరరావు, న్యూరోసర్జన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ సర్వజనాసుపత్రి

అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, నిద్రలేమి, ఒత్తిడి, శారీరక శ్రమలేకపోవడం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే అధికంగా స్మార్ట్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా వినియోగంతో నిద్ర, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన నిద్ర, సమతుల ఆహారం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Updated Date - Jul 22 , 2026 | 06:53 AM