Share News

The box is there... but there are no medicines. బాక్స్‌ ఉంది.. మందుల్లేవ్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:22 AM

The box is there... but there are no medicines. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం...సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం’ అని చెప్పే ఆర్‌టీసీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. భద్రతా పరమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాద సమయంలో చేతులెత్తేస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందివ్వలేక పోతున్నారు. జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట డిపోల పరిధిలో 160 బస్సులు నడుస్తున్నాయి.

The box is there... but there are no medicines. బాక్స్‌ ఉంది.. మందుల్లేవ్‌
డ్రైవర్‌ సీటు వెనుక మందుల్లేని ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌

బాక్స్‌ ఉంది.. మందుల్లేవ్‌

ఆర్టీసీ బస్సులో కానరాని ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు

ఖాళీగా బాక్సులు.. మందులున్నా కాలం చెల్లినవే

ప్రమాదం జరిగితే ప్రయాణికులకు అవస్థలే

గత ఏడాది మెంటాడ మండలం జయితి గ్రామం వద్ద ఆర్టీసీ హైర్‌ బస్సు బోల్తా కొట్టింది. చాల మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు తెరవగా అందులో మందులు లేవు. కనీసం దూది, ప్లాస్టర్‌, డెటాల్‌, అయోడిన్‌ ఆయింట్‌మెంట్‌ కూడా లేవు. దీంతో గాయాలతో గజపతినగరం ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు.

గత ఏడాది గుర్ల వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఓ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ తెరచి చూడగా.. అందులో మందులు లేవు.. వెంటనే ఆమె కాలికి గుడ్డకట్టు వేసి రక్తస్రావం జరగకుండా ప్రయాణికులే ప్రథమ చికిత్స అందించారు. వెంటనే పీహెచ్‌సీకి తరలించారు.

విజయనగరం/రింగురోడ్డు, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి):

‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం...సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం’ అని చెప్పే ఆర్‌టీసీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. భద్రతా పరమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాద సమయంలో చేతులెత్తేస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందివ్వలేక పోతున్నారు. జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట డిపోల పరిధిలో 160 బస్సులు నడుస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం, సాలూరు డిపోల బస్సులు కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. అయితే ప్రతి బస్సుకూ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, లైసెన్స్‌డ్‌ డ్రైవర్‌, కండక్టర్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉన్నాయా అంటే ఏమో అన్న సందేహమే వినిపిస్తోంది. విజయనగరం డిపోకు వచ్చిన బస్సుల్లో ఆంధ్రజ్యోతి పరిశీలనలో సింహభాగం బస్సుల్లో అసలు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులే లేవు. కొన్నింటికి ఉన్నా అందులో కాలం చెల్లిన ఆయింట్‌మెంట్‌, ఇతర ఔషధాలు దర్శనమిచ్చాయి. మరికొన్ని బస్సుల్లో ఖాళీ బాక్సుల్లో రెంచీలు, ఇతర సామాన్లు పెడుతున్నారు.

అపాయం ఎదురైతే..

ప్రయాణికులకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా ఇచ్చే తొలి వైద్యమే ఫస్ట్‌ ఎయిడ్‌. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు ప్రయాణికులకు బస్సుల్లో అందుబాటులో లేవు. బాక్సులు మాత్రం దర్శనమిస్తున్నాయి. వాటిలో కనీసం దూది, ప్లాస్టర్‌, డెటాల్‌, అయోడిన్‌ ఆయింట్‌మెంట్‌ వంటివి అందుబాటులో ఉంచలేకపోతున్నారు. నష్టం జరిగాక దిద్దుబాటు చర్యలు తీసుకొనే కంటే ముందే జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

ఆ నిధుల సంగతేంటి..?

బస్సుల నిర్వహణ కోసం, ఇతరత్రా సేవల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోంది. అలాంటిది ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లకు నిధులు లేవంటే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదం జరగక ముందే అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

పరిశీలిస్తాం

లోపాలుంటే బస్సులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లను కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంచాం. ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం.

- జి.వరలక్ష్మి, డీపీటీవో, విజయనగరం

Updated Date - Oct 15 , 2026 | 12:22 AM