The beginning.. Peace ఆరంభం.. ప్రశాంతం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:30 AM
The beginning.. Peace జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. మొదటి రోజు విద్యార్థులు ఉదయానే తొందరగా లేచి హడావిడిగా సిద్ధమై తల్లిదండ్రులతో దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు.
ఆరంభం.. ప్రశాంతం
మొదటి రోజు 75 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షకు దూరం
హాజరైన 22,940 మంది
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. మొదటి రోజు విద్యార్థులు ఉదయానే తొందరగా లేచి హడావిడిగా సిద్ధమై తల్లిదండ్రులతో దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఆయా కేంద్రాల నోటీసు బోర్డులో హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా కేటాయించిన పరీక్ష గదిని చూసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 పరకూ పరీక్ష జరిగింది. 23,015 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 22,940 మంది హాజరయ్యారు. 99.67శాతం రాశారు. 75 మంది పరీక్షకు దూరంగా ఉన్నారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఒక కేంద్రాన్ని, విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మూడు కేంద్రాలు, జిల్లా పరిశీలకులు 8 కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామ్స్ 7 కేంద్రాలు, జిల్లా విద్యా శాఖ అధికారి 9 కేంద్రాలు, స్క్వాడ్ సిబ్బంది 61 కేంద్రాలను తనిఖీ చేశారు.
లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలి
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని బీపీఎం పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీసు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు కల్పించే మౌలిక సదుపాయలపై ఆరా తీశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, గాలి తగిలేలా చూడాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట డీఈవో మాణిక్యంనాయుడు ఉన్నారు.