Village Begins పల్లెపోరుకు మోగిన నగారా
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:35 AM
The Battle for the Village Begins గ్రామాల్లో సందడి మొదలైంది. పల్లెపోరుకు నగారా మోగింది. స్వల్ప మార్పులతో శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు మొదటి దశలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగ నున్నాయి. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస, గరుగుబిల్లి కొమరాడ మండలాల పరిధిలో ఉన్న పంచాయతీల్లో పల్లె పోరు ప్రారంభం కానుంది.
షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
మొదటి దశలో కురుపాం, పార్వతీపురం..
రెండో దశలో పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ..
26న పోలింగ్ ..అదేరోజు ఫలితాల ప్రకటన
పార్వతీపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సందడి మొదలైంది. పల్లెపోరుకు నగారా మోగింది. స్వల్ప మార్పులతో శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు మొదటి దశలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగ నున్నాయి. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస, గరుగుబిల్లి కొమరాడ మండలాల పరిధిలో ఉన్న పంచాయతీల్లో పల్లె పోరు ప్రారంభం కానుంది. మొదటి దశలో జరుగుతున్న పంచాయతీలకు సంబంధించి ఈనెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడిస్తారు. మొదటి దశలో 226 పంచాయతీల్లో 2116 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. 3.46 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా పార్వతీపురం డివిజన్‌లో రెండు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
రెండో దశలో ..
జిల్లాలోని సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. సాలూరు, పాచిపెంట, మక్కువ , వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని మండలాల పరిధిలో ఉన్న పంచాయతీలకు సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 29న పోలింగ్ నిర్వహించే వీలుంది .కాగా రెండో దశలో 225 పంచాయతీల్లో 2,028 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 2.97 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
షెడ్యూల్‌లో మార్పు .. తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు
వీరఘట్టం: మొదటి దశలో పాలకొండ డివిజన్ , రెండో దశలో పార్వతీపురం డివిజన్ పరిధిలో పంచాయ తీలకు ఎన్నికలు నిర్వహించాలని భావించారు. దీనిని అధికారులు కూడా ధ్రువీక రించారు. కానీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి దశలో పార్వతీపురం, రెండో దశలో పాలకొండ డివిజన్లలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఈనెల మొదటి దశలోనే పాలకొండ డివిజన్‌లో పోలింగ్ జరగనుందని భావించిన ఆశావహులు.. ఇప్పటికే తమ గ్రామం నుంచి వివిధ ప్రాంతాల్లో చదువుతున్న, ఉపాధి కోసం వెళ్లిన వారిని రప్పించేందుకు ట్రైన్ , బస్సు టిక్కెట్లు బుక్ చేశారు. తీరా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ మారడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. తమ బంధువులు, గ్రామస్థులకు ఫోన్ చేసి టిక్కెట్లు రద్దు చేస్తున్నారు. రెండో విడతలో జరిగే ఎన్నికలకు రావాలని సందేశాన్ని పంపుతున్నారు.