Share News

Constituencies Begins ప్రాదేశిక పోరు ఆరంభం

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:51 AM

The Battle for Territorial Constituencies Begins జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా తొలిరోజు జడ్పీ, మండలపరిషత్‌ కార్యాలయాల్లో అంతంతమాత్రంగానే నామినేషన్లు వచ్చాయి. గురు, శుక్రవారం నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది.

 Constituencies Begins   ప్రాదేశిక పోరు ఆరంభం
నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు

పార్వతీపురం, అక్టోబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా తొలిరోజు జడ్పీ, మండలపరిషత్‌ కార్యాలయాల్లో అంతంతమాత్రంగానే నామినేషన్లు వచ్చాయి. గురు, శుక్రవారం నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరణ , 24న పరిశీలన ఉంటుంది. 27 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. వచ్చే నెల మూడో తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. ఐదో తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఫలితాలు కూడా అదేరోజు ప్రకటిస్తారు.

ఎంపీటీసీలకు 102, జడ్పీటీసీలకు 5...

ఎంపీటీసీ స్థానాలకు మొదటిరోజున 102 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మక్కువ మండలంలో ఐదు, సాలూరులో 16, పాలకొండలో మూడు, జియ్యమ్మవలసలో 16, గుమ్మ లక్ష్మీపురంలో ఐదు, పాచిపెంటలో 11, పార్వతీపురంలో ఐదు, సీతానగరంలో ఏడు, వీరఘట్టంలో ఏడు, కొమరాడలో ఐదు, బలిజిపేటలో నాలుగు, కురుపాంలో ఆరు, భామినిలో ఏడు, గరుగుబిల్లిలో ఐదు నామినేషన్లు పడ్డాయి. సీతంపేట మండలంలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఐదు నామినేషన్లు వచ్చాయి. టీడీపీ నుంచి రెండు , వైసీపీ నుంచి రెండు , బీజేపీ నుంచి నుంచి ఒకటి చొప్పున జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ దాఖలు అయ్యాయి.

కొలిక్కి రాని సీట్ల సర్దుబాటు

జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కాలేదు. ఇది కొలిక్కి వస్తేనే మరికొంతమంది నామినేషన్లు దాఖలు వేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఏ జడ్పీటీసీ స్థానం ఏ పార్టీకి కేటాయిస్తారో తెలియని పరిస్థితి . ఈ క్రమంలో కొంతమంది జడ్పీటీసీలు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఏ పార్టీకి ఎన్ని ఎంపీపీ స్థానాలనేది కూడా ఇంకా ఖరారు కాలేదు.

Updated Date - Oct 22 , 2026 | 12:51 AM