పేరు సంఘాలది.. సొమ్ము కార్పొరేటర్లది
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:28 AM
నగరంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టాయి.
- సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ నిధులు పక్కదారి
- గత ఐదేళ్లలో రూ.1.62కోట్లు వారి జేబుల్లోకి
- పట్టించుకోని అధికారులు
విజయనగరం టౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టాయి. స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ చేసిన ఈ నిధులు కార్పొరేటర్ల జేబుల్లోకి వెళ్లాయి. 50 డివిజన్లలో ఉన్న 34 మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి గత ఐదేళ్లలో మంజూరైన రూ.1.62కోట్లను కార్పొరేటర్లు మింగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని కొత్తపేట స్వీపర్‌వీధి, దాసన్నపేట యాతవీధి, లంకవీధి, మజ్జివీధి, బొంగవీధి, తోటపాలెం శ్మశానవాటిక, కణపాక ఎస్సీకాలనీ, వీటీ అగ్రహారం, మర్రిచెన్నారెడ్డి కాలనీ, కణపాక మహాంతివీధి, స్వీపర్‌కాలనీ, గంజిపేట, జొన్నగుడ్డి రెల్లివీధి, రెల్లివీధి-2, కొత్తపేట వాటర్ ట్యాంకు, గొంపవీధి, మేదరవీధి, హుకుంపేట, జగన్నాథపురం, లంకాపట్నం రైతువీధి, శాంతినగర్.. ఇలా 34చోట్ల సామూహిక మరుగుదొడ్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను స్థానిక స్వయంసహాయక సంఘాలకు ప్రజారోగ్యశాఖ అధికారులు అప్పగించారు. ఇందుకు గాను ఆ సంఘాలకు ఒక్కొక్క షీట్‌కు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించేవారు. ఈ లెక్కన 34 మరుగుదొడ్లకు సంబంధించి రూ.32 వేల నుంచి రూ.40వేల వరకు ఆ సంఘాల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే, పేరుకే మరుగుదొడ్ల నిర్వహణను సంఘాలకు అప్పగించి, నిధులన్నీ కార్పొరేటర్లు కాజేసేవారని స్థానిక మహిళలు వాపోతున్నారు. గత ఐదేళ్లలో మంజూరైన రూ.1.62కోట్లను గత కార్పొరేషన్ పాలకులు తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని డివిజన్లలో స్థానిక పారిశుధ్య కార్మికులతో తూతూ మంత్రంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించేవారని, మరికొన్ని వార్డుల్లో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆయనకు ఎంతోకొంత ఇచ్చి క్లీన్ చేయించి నిధులను మింగేశారని స్వయ సహాయ సంఘాల మహిళలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం, నిధులు ఏమవుతున్నాయో గమనించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేటర్ భర్త తీసుకునేవారు..
మా వీధిలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతినెలా రూ.30వేలు మా ఖాతాలో పడేవి. డబ్బులు పడగానే ఓ కార్పొరేటర్ భర్త మా నుంచి డబ్బులు తీసుకునేవారు. రూపాయి కూడా మా సంఘం మహిళలకు ఇచ్చేవారు కాదు.
-శ్రీరామ పొదుపు సంఘం అధ్యక్షురాలు, కణపాక మహాంతి వీధి.
మా దృష్టికి రాలేదు..
ప్రతి నెలా 34 సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.32వేల నుంచి రూ.40వేలు ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేసే వాళ్లం. ఆ డబ్బులను వారు స్థానిక కార్పొరేటర్లకు ఇచ్చినట్లు ఇంత వరకూ మా దృష్టికి రాలేదు. ఈ నిధులు సంఘ సభ్యులే తీసుకోవాలి. వేరే వారికి ఇచ్చినట్లు మాకు తెలియదు.
-కొండపల్లి సాంబమూర్తి, ప్రజారోగ్యశాఖాధికారి, విజయనగరం కార్పొరేషన్