Share News

కూటమి వ్యూహం అదుర్స్‌!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:42 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

   కూటమి వ్యూహం అదుర్స్‌!

జిల్లా నుంచి మిత్రపక్షాలకు అవకాశం

నెల్లిమర్ల బీజేపీకి, రాజాం జనసేనకు

గెలిపించే బాధ్యతలు ఎమ్మెల్యేలకు, కీలక నేతలకు

మూడు పార్టీల మధ్య సమన్వయానికి ప్రణాళిక

విజయనగరం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి మునిసిపాల్టీని టీడీపీకి.. నెల్లిమర్ల బీజేపీకి, రాజాం జనసేనకు కేటాయించింది. ఇక్కడే వ్యూహాత్మకత కనిపిస్తోంది. నెల్లిమర్ల నగర పంచాయతీని జనసేనకు కేటాయిస్తారని అంతా భావించారు. ఎందుకంటే అక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. అయితే ఇటీవల పరిణామాలతోనే అక్కడ మార్పు చేసినట్టు అర్థమవుతోంది. అక్కడ జనసేనకు, టీడీపీకి ఆశించిన స్థాయిలో సమన్వయం లేదు. మొన్నటి స్కూల్‌ కమిటీల ఎన్నికల్లోనే వివాదాలు నడిచాయి. అందుకే అక్కడ బీజేపీకి చైర్మన్‌ పీఠం అప్పగించి.. గెలిపించే బాధ్యతను స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి, టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజుకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో రాజాం మునిసిపాల్టీని అనూహ్యంగా జనసేనకు అప్పగించడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. గతంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని సైతం జనసేనకు కేటాయించారు. ఇప్పుడు మునిసిపల్‌ పీఠం సైతం అప్పగించడం వెనుక భారీ వ్యూహం ఉంది. తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన కోండ్రు మురళీమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో సీనియర్‌ నేత కళా వెంకటరావు కుటుంబ ప్రాబల్యం ఉన్న పట్టణం. అందుకే మిత్రపక్షమైన జనసేనకు ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించడం, గెలుపు బాధ్యతలను టీడీపీ నేతలందరిపై పెట్టడం చూస్తుంటే అంతా వ్యూహమేనని అర్థం అవుతోంది. టీడీపీలో చైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే జనసేనకు కేటాయించారన్న వాదన ఉంది.

అందర్నీ ఒప్పించి..

వాస్తవానికి విజయనగరం జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం పతాకస్థాయికి చేరింది. కానీ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను జనసేనకు కేటాయించారు. విజయనగరాన్ని తప్పించారు. దీన్ని టీడీపీకి కేటాయించారు. మేయర్‌ పదవి కోసం ఆరుగురు వరకూ ఆశావహులు ఉన్నారు. వారిలో ఒకర్ని ఇప్పటికే ఎంపిక చేసి ప్రకటించేశారు. కానీ చివరిలో అనూహ్యంగా ఇటీవల పార్టీలో చేరిన చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్ర పేరు వచ్చి చేరింది. అంటే అధిష్టానం భారీ ఆలోచనతోనే ఈ కసరత్తు చేస్తున్నట్టు అర్థమవుతోంది. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం, మూడు పార్టీల మధ్య సానుకూల వాతావరణం, బలమైన ప్రత్యర్థివర్గాన్ని చిత్తు చేయడం వంటి వ్యూహాలను అమలుచేస్తున్నట్టు పూర్తిగా అవగతం అవుతోంది. పదవులు ఆశించిన వారిని సముదాయించి.. ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా పనిచేసేలా అధిష్టానం ఒప్పిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్‌ చెప్పడమే కాదు.. జనసేనతో పాటు బీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా కూటమి కలిసికట్టుగా విజయదుంధుబి మోగిసుందన్న సంకేతాలు బలంగా పంపే వ్యూహమని స్పష్టంగా అర్ధమవుతోంది.

Updated Date - Oct 17 , 2026 | 12:42 AM