The alliance wins in Vizianagaram కూటమిదే విజయనగరం
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:19 AM
The alliance wins in Vizianagaram విజయనగరం కార్పొరేషన్‌లో కూటమి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. మేయర్‌గా అవనాపు భార్గవి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కోలగట్ల శ్రావణిపై 18,407 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలట్ నుంచే పైచేయిగా నిలిచారు.
కూటమిదే విజయనగరం
మేయర్‌గా అవనాపు భార్గవి ఘన విజయం
18,407 ఓట్ల మెజార్టీ కైవసం
నీరుగారిన వైసీపీ ప్రయత్నాలు
సర్వశక్తులూ ఒడ్డిన ఎమ్మెల్యే అదితి
పట్టు నిలుపుకున్న తెలుగుదేశం పార్టీ
సంబరాల్లో కూటమి శ్రేణులు
రాజీవ్ క్రీడామైదానంలో ఓట్ల లెక్కింపు
విజయనగరం కార్పొరేషన్‌లో కూటమి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. మేయర్‌గా అవనాపు భార్గవి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కోలగట్ల శ్రావణిపై 18,407 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలట్ నుంచే పైచేయిగా నిలిచారు. అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లో మేయర్‌తో పాటు కూటమి అభ్యర్థులే ముందంజలో వున్నారు. ఎక్కడా వైసీపీకి అవకాశం లేకుండా మెజార్టీ పెంచుకుంటూ వచ్చారు. మరోవైపు లెక్కింపు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు విజయదరహాసంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బొబ్బిలి కోటపై కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. ఏకపక్షంగా విజయం కైవసం చేసుకుంది. సొంతంగా 24 స్థానాలను సాధించింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి రేణుకాదేవి స్వప్న 5,149 మెజారిటీ సాధించారు.
నెల్లిమర్ల కూడా కూటమి పార్టీలదే పైచేయి. అక్కడున్న 23 వార్డుల్లో 15 చోట్ల విజయం సాధించాయి. చైర్మన్‌గా మాత్రం స్వతంత్రుడైన లెంక అప్పలనాయుడు ఎన్నికయ్యారు. టీడీపీ బీఫారం దక్కకపోవడంతో పట్టుదలతో బరిలో నిలిచారు.
విజయనగరం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
విజయనగరంలోని 62 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు మేయర్ అభ్యర్థి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం రాజీవ్‌క్రీడామైదానంలో జరిగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లలో మేయర్ టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవికి 380 ఓట్లు పోలవ్వగా, వైసీపీ మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణికి 232 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌లో స్వల్ప మెజార్టీ సాధించిన భార్గవి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులో కోలగట్ల శ్రావణిపై 6,970 ఓట్ల అధిక్యత సాధించారు. ఆ తర్వాత పూర్తిగా ముందంజలో సాగారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ పోరు ఆదినుంచి ప్రతిష్ఠాత్మకంగా సాగింది. రాష్ట్రంలో కడప, కర్నూలు, తిరుపతి తరువాత వైసీపీ గురి ఎక్కువగా విజయనగరంపైనే ఉండేది. అనూహ్యంగా ఈ కార్పొరేషన్‌ను పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. ఆపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అలుపెరగని కృషిచేశారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టు సడలకుండా చూసుకున్నారు. ఇతర కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. అసంతృప్తులను దారిలోకి తెచ్చుకున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి సీనియర్ నేత చిన్నశ్రీను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరడం కలిసొచ్చే అంశం. ఆపై నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సైతం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితర కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్థం చేసుకున్న ప్రజలు విజయం కట్టబెట్టారు. మొత్తం 62 డివిజన్లలో 35స్థానాలు టీడీపీకి, వైసీపీకి 16, జనసేనకు6, బీజేపీకి 3,స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు.