That's it for 20 years! 20 ఏళ్లుగా అంతే!
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:25 PM
That's it for 20 years! తారకరామతీర్థ సాగర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2005లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. 2008 నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
20 ఏళ్లుగా అంతే!
తారకరామ తీర్థసాగర్ పనులు ఎక్కడివక్కడే
తుప్పు పడుతున్న గేట్లు.. సొరంగం పనులెప్పుడో
అధికారులు, నేతలు పరిశీలనకు రావడం, వెళ్లడంతో సరి
తారకరామతీర్థ సాగర్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2005లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. 2008 నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. 20 ఏళ్లు దాటినా పనుల దశ దాట లేదు. ఆది నుంచి నిర్మాణం సాగుతూ.. ఆగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు గతించినా భూ పరిహారం.. పునరావాసం కొలిక్కి రాలేదు. మరోవైపు స్పిల్‌వే గేట్లు, ఇతర సామగ్రి తుప్పు పడుతున్నాయి. కాలువలు రూపు కోల్పోయాయి. కొండను తవ్వి చేపట్టాల్సిన సొరంగం పనులు మొదలే కాలేదు.
గుర్ల, మార్చి9(ఆంధ్రజ్యోతి): తారకరామ తీర్థసాగర్... 24,700 ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీరు అందజేయాలన్న ఆశయంతో ఆనందపురం వద్ద చంపావతి నదిలో చేపట్టిన ప్రాజెక్టు. ఇరవై ఏళ్ల కిందట నిర్మాణం ప్రారంభించినా నేటికీ 40శాతం పనులు పూర్తికాలేదు. మరోవైపు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటా పెరుగుతోంది. 12 స్పిల్‌వే గేట్లు అమర్చారు. వాటిని ఉపయోగించకపోవడంతో తుప్పు పడుతున్నాయి. ప్రాజెక్టు రెండువైపులా గోడ నిర్మిస్తే ఒకవైపు ఆనందపురం, ఇంకోవైపు గరికవలస గ్రామం ముంపునకు గురికాకుండా ఉంటుందన్నారు. ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఇక్కడ స్పిల్‌వే నిర్మాణ పనులు, కాలువలు పూర్తయితే కుమిలి వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు నీరు పంపి నిల్వ చేయాల్సి ఉంది. ఆపై అక్కడ నుంచి సుమారు 25వేల ఎకరాలకు తాగునీరు, సాగునీరుతోపాటు కొత్త ప్రతిపాదనల ప్రకారం విమానాశ్రయానికి కూడా నీరు అందించాల్సి ఉంది. కాగా కాలువల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆనందపురం నుంచి ప్రధాన కాలువ పొదలతో నిండిపోయింది. ఆనందపురం, నక్కలపేట, కోటగండ్రేడు, కలవచర్ల, గోశాడ, కెల్ల, మన్యపురిపేట, ఎస్‌ఎస్‌ఆర్.పేట తదితర గ్రామాల గుండా ఈ కాలువ గొర్లిపేట కొండ వరకు తవ్వి వదిలేశారు. ఇంకోవైపు ఎస్‌ఎస్‌ఆర్.పేట వద్ద ఉన్న కొండను తవ్వి సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉంది. 1.025 కిలోమీటర్ల మేర సొరంగం పనులు నిర్వహించేందుకు అటవీ శాఖ అనుమతులు తప్పని సరి. ఇంతవరకు ఆ అనుమతులు రాలేదంటున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వల పరిధిలో కూడా కొన్ని చోట్ల అటవీ శాఖ అనుమతులు రావాలి.
పూర్తికాని భూ సేకరణ
రిజర్వాయర్ భూ సేకరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు పరిధిలో ప్రభుత్వ భూములు మినహా రైతులనుంచి భూములు కొనుగోలు చేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. ఇంకా ప్రాజెక్టు నిర్మాణం, కాల్వల తవ్వకాలకు 300 ఎకరాలను అందించాల్సి ఉంది.