Thatipudi... no dovelopment తాటిపూడి.. మరుగున పడి
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:00 AM
Thatipudi... no dovelopment తాటిపూడి ఎందుకిలా తయారైంది? జిల్లా పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకునే జలాశయాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారేంటి? రోడ్డు పాడైనా పట్టించుకోరా? దట్టంగా పెరిగిన పొదలు కనిపించట్లేదా? గిరి వినాయక విగ్రహం.. కాటేజీ.. రివర్‌బే రిసార్ట్ ఇలా అన్నీ మరుగున పడిపోవడమేంటి?.. ఇవీ తాటిపూడి సందర్శకుల ప్రశ్నలు. ఒకప్పుడు అందమైన విడిదిగా ఉండే ఈ ప్రాంతం నేడు కళావిహీనంగా తయారుకావడంపై ఆవేదన చెందుతున్నారు.
తాటిపూడి.. మరుగున పడి
కళతప్పిన జలాశయం
కానరాని పర్యాటకాభివృద్ధి
దయనీయంగా పరిసరాలు
పాడైన రహదారి
ఎక్కడికక్కడ పెరిగిన పొదలు
తాటిపూడి ఎందుకిలా తయారైంది? జిల్లా పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకునే జలాశయాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారేంటి? రోడ్డు పాడైనా పట్టించుకోరా? దట్టంగా పెరిగిన పొదలు కనిపించట్లేదా? గిరి వినాయక విగ్రహం.. కాటేజీ.. రివర్‌బే రిసార్ట్ ఇలా అన్నీ మరుగున పడిపోవడమేంటి?.. ఇవీ తాటిపూడి సందర్శకుల ప్రశ్నలు. ఒకప్పుడు అందమైన విడిదిగా ఉండే ఈ ప్రాంతం నేడు కళావిహీనంగా తయారుకావడంపై ఆవేదన చెందుతున్నారు.
గంట్యాడ, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): చుట్టూ ఎత్తైన కొండలు.. వాటిని తాకుతూ దోబూచులాడే మేఘాలు.. నేలపై తివాచీ పరిచినట్లుగా పచ్చదనం.. అటవీశాఖ పరిధిలో ఎకో టూరిజం కేంద్రం.. ఆకట్టుకునే గిరి వినాయక విగ్రహం.. దిగువన కాటేజీ, క్యాంటీన్.. జలాశయం బయట రివర్‌బే రిసార్ట్‌తో పాటు ఒకవైపు మైదాన ప్రాంతానికి మరోవైపు గిరిసీమలకు మధ్య ఉన్న తాడిపూడి జలాశయం అందాలు కనువిందు చేసేవి. ఇక్కడ గడిపేందుకు వారాంతాల్లో పోటీపడేవారు. పర్యాటకులు పోటెత్తేవారు. అలాంటి ప్రాంతం గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. నిర్వహణ గాడి తప్పింది. నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. జలాశయం బయట రూ.43లక్షలతో నిర్మించిన రివర్‌బే రిసార్ట్ దిష్టిబొమ్మలా మిగిలింది. అధునాతన భవనాలు నిరుపయోగంగా మారాయి. రిజర్వాయర్ గట్టుపై ఉన్న రోడ్డు అధ్వానంగా తయారైంది. గోడలు కూలిపోతున్నాయి. జలాశయం చుట్టూ పొదలు దట్టంగా పెరిగాయి. గేట్ల ద్వారా నిత్యం నీరు లీకవుతోంది. పర్యవేక్షించే సిబ్బంది కూడా లేరు. బోటు షికారు చేసేందుకు కేటాయించిన బోట్లు మరమ్మతులకు గురయ్యాయి.
తాటిపూడి రిజర్వాయర్‌ను 1968 అక్టోబరు 2న అప్పటి పురపాలక శాఖ మంత్రి అలపాటి ధర్మరావు ప్రారంభించారు. చుట్టూ ఉన్న కొండల్లో కురిసిన వర్షపు నీరు జలాశయంలోకి చేరుతుంటుంది. ఆయకట్టు మూడు వేల ఎకరాలు కాగా రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.3 టీఎంసీలు. రిజర్వాయర్‌కు నాలుగు గేట్లు, స్పిల్‌వే ఉన్నాయి. అప్పట్లో రిజర్వాయర్ పరిధిలో 23మంది సిబ్బంది పని చేసేవారు. విశాఖ వాసుల దాహం తీర్చడానికి ప్రతి రోజు 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే కాకుండా గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల పరిఽదిలో ఉన్న గ్రామాలకు తాగునీరు, 15 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్(294) అడుగులు. కాగా రిజర్వాయర్ అభివృద్ధి, పర్యవేక్షణ కోసం ప్రతి ఏడాది విశాఖ కార్పొరేషన్ రూ.15 లక్షలు విడుదల చేస్తుంటుంది. ఈ నిధులు సంబంధిత శాఖ రాష్ట్ర అకౌంట్ హెడ్‌కు జమవుతున్నాయి. దీనివల్ల రిజర్వాయర్ వద్ద ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో జలాశయం వద్ద సమస్యలు పరిష్కారం కావడం లేదు.
- జలాశయం పరిసరాలన్నీ జంగిల్‌తో నిండిపోయాయి. డ్యామ్‌పై రక్షణగోడ బీటలు ఇస్తోంది. గేట్లు పాడువుతున్నా పెయింటింగ్ వేయడం లేదు. చాలా సంవత్సరాలు అలాగే వదిలేశారు. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందో? అనే భయంతో సిబ్బంది ఉన్నారు. రిజర్వాయర్ వద్ద 11 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా ఇద్దరే విధులు నిర్వహిస్తున్నారు. ఎలక్ర్టీషియన్ లేకపోవడం వల్ల ఏదైనా సమస్య వస్తే బయట వ్యక్తులను తెప్పించుకునే పరిస్థితి ఉంది. రిజర్వాయర్ గట్టు కింద రూ.లక్షలు విలువ చేసే టేకుచెట్లు ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో చాలా చెట్లు దొంగల పాలవుతున్నాయి. పంట పొలాలకు సాగునీరు విడుదల చేసినప్పడు ప్రవాహంలో ఇబ్బందులు తలెత్తకుండా లస్కర్లు చూసుకోవాలి. వారు లేకపోవడంతో ఏటా ఖరీఫ్ సీజన్ రెండు నెలల కోసం ఇద్దరిని నియమించుకుని వారితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటు పర్యాటకాభివృద్ధి పూర్తిగా పడకేసింది.
పొదలను తొలగిస్తాం
పొదలను తొలగిస్తాం. గట్టుపై కొత్త రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జలాశయం వద్ద సిబ్బంది లేరు. గేట్ల వద్ద లీకులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ఆకౌంట్ హెడ్‌కు కాకుండా తమకు అందేలా చూడాలని కలెక్టర్ ద్వారా లేఖ రాశాం. ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది.
- శంకర్, జేఈ, ఇరిగేషన్