Share News

That position is ours!ఆ పదవి మాకే!

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:32 PM

That position is ours! స్థానిక పోరులో వరుసగా ఏకపక్ష విజయం సొంతం చేసుకున్న టీడీపీ కూటమికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌ లాంటి పదవుల భర్తీ మాత్రం కత్తిమీద సాములా మారింది. కొన్ని మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు ఇప్పటికీ ఖరారు కాలేదు.

That position is ours!ఆ పదవి మాకే!

ఆ పదవి మాకే!

జడ్పీ చైర్‌పర్సన్‌ కోసం నేతల గట్టి ప్రయత్నాలు

ఎంపీపీలతో పాటు డిప్యూటీ పదవులకూ డిమాండ్‌

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చుట్టూ ప్రదక్షిణలు

కొలిక్కిరాని సర్దుబాటు.. 23న డిప్యూటీలకు ఎన్నికలు

విజయనగరం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక పోరులో వరుసగా ఏకపక్ష విజయం సొంతం చేసుకున్న టీడీపీ కూటమికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌ లాంటి పదవుల భర్తీ మాత్రం కత్తిమీద సాములా మారింది. కొన్ని మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఆయా చోట్ల గట్టి పోటీ నెలకొంది. నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత దృష్టిలో పడేందుకూ పడరాని పాట్లు పడుతున్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది. ఏకపక్షంగా గెలుపొందింది. 27 జడ్పీటీసీలకుగాను 22 చోట్ల కూటమి విజయం సాధించింది. 5 జడ్పీటీసీలకే వైసీపీ పరిమితం అయ్యింది. అటు మునిసిపల్‌ ఎన్నికల్లో సైతం వైసీపీ మట్టి కరిచింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మునిసిపాల్టీని సైతం కైవసం చేసుకుంది. నెల్లిమర్లలో టీడీపీ రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. అయితే వైసీపీకి ఎక్కడా చోటు లేకుండా పోయింది. ఇంతవరకూ కూటమికి అంతా అనుకూలమే జరిగింది. అయితే పదవుల విషయంలో సర్దుబాటు కుదరడం లేదు. నేతలు ఒక అభిప్రాయానికి రావడం లేదు.

తొలుత విజయనగరం కార్పొరేషన్‌తో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవుల కోసం జనసేనతో పాటు టీడీపీ పట్టుబట్టాయి. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరి నిమిషంలో సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ పరిణామం తమకు అనుకూలిస్తుందని వైసీపీ నేతలు భావించారు. అయినా సరే కూటమి తిరుగులేని విజయం సాధించింది. కాగా టీడీపీ నుంచి జడ్పీచైర్‌పర్సన్‌ పదవి కోసం కర్రోతు బంగార్రాజు, చిన్నశ్రీను మధ్య గట్టి పోటీ ఉంది. ఈ ఇద్దరు నేతలు తమ కుమార్తెలను జడ్పీ పీఠంలో కూర్చోబెట్టేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఎవరికి వారుగా తమకున్న పరిచయాలను ఉపయోగించుకొని ప్రయత్నాలు చేస్తున్నారు.

కొలిక్కిరాని ఎంపీపీ పదవులు

గుర్ల మండల ఎంపీపీ పదవి అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య దోబూచులాడుతోంది. ఇక్కడ వైరి పక్షాలు చెరి సగం ఎంపీటీసీ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉండడంతో ఎట్టి పరిస్థితిలో ఆ ఎంపీపీ పదవి తమదేనని టీడీపీ ధీమాతో ఉంది. ఇక నెల్లిమర్లలాంటి నియోజకవర్గంలో జనసేన నుంచి కూడా ఎంపీపీ అభ్యర్థులు ఉన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల ఎంపీపీల స్థానాలు దక్కించుకోవడం కోసం జనసేన తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే స్థాయిలో టీడీపీ నేతల నుంచి విముఖత ఉంది. అందుకే టిక్కెట్ల కేటాయింపులో జరిగిన పంచాయితీ మరోసారి తలెత్తే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఒకటి రెండు ఎంపీపీలైనా దక్కించుకోవాలనే పట్టుదలతో నెల్లిమర్ల ఎమ్మెల్యే మాదవి ఉన్నట్లు తెలిసింది. ఇంకోవైపు విజయనగరం కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌, బొబ్బిలి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవిపై సైతం జనసేన ఆశలు పెట్టుకుంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

ఫ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికోసం డెంకాడ టీడీపీ సీనియర్‌ నాయకుడు కంది చంద్రశేఖర్‌ తన సతీమణితో జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. చివరి సమయంలో పొత్తులో భాగంగా డెంకాడ జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన మహిళ తుమ్మిరాజు లక్ష్మీని ప్రకటించారు. అదిష్టానం ఆదేశాల మేరకు కంది చంద్రశేఖర్‌ తన సతీమణి రమాదేవితో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రశేఖర్‌ మద్దతుతో కొందరు ఎంపీటీసీలు పోటీలో ఉన్నారు. వారికి బీఫారాలు అందలేదు. దీంతో వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఒక్కరు మినహా మిగతావారు గెలుపొందారు. అయితే ఈ మండలంలో ఎంపీపీని నియమించుకునే బాధ్యతను కంది చంద్రశేఖర్‌ చూస్తారని తెలిసింది.

ఫ గంట్యాడ మండలం మథనాపురం గ్రామానికి చెందిన రంధి సరోజిని జడ్పీ డిప్యూటీ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావంనుంచి పార్టీ అభివృద్ధి, ఎదుగుదల కోసం కృషిచేస్తున్నానని, తనకు అవకాశం కల్పించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కోరుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో ఎంపీపీ ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇక్కడ వైస్‌ ఎంపీపీ పదవికి డిమాండ్‌ నెలకొంది. చింతాడ, పిరిడి గ్రామాలకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుల కుటుంబీకులకు ఈ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే, బుడాచైర్మన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదే విదంగా వేపాడ, జామి మండలాలకు ఎంపీపీ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇలా జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవుల కోసం కూటమి పార్టీల నేతలు పట్టుబడుతున్నారు.

19న ఎంపీపీ, 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక

షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండల అధ్యక్షులు, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఎన్నుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 14న ప్రత్యేక సమావేశానికి నోటీసు జారీ చేస్తారు. 19న ఉదయం 10 గంటలకు కోఆప్షన్‌ సభ్యులు నామినేషన్‌ వేయాల్సి ఉంది. 10 నుంచి 12 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన, 12 గంటలకు చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒంటి గంట లోపు కోఆప్షన్‌ సభ్యుని ఎన్నిక ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నాం 3 గంటలు వరకూ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపిక నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఆదే రోజు ఎన్నిక జరగకపోతే 20వ తేదీన 3 గంటలకు ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్‌లో పొందుపరిచారు. అలాగే 14న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎంపిక కోసం నోటీసు జారీ చేస్తారు. ఈనెల 20న ఉదయం 10 గంటలకు కోఆప్షన్‌ నెంబర్లకు నామినేషన్‌, 3 గంటలకు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక నిర్వహిస్తారు.

----------------------

Updated Date - Nov 10 , 2026 | 11:32 PM