అదే ఆఖరి పిలుపు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:32 AM
సాలూరు పట్టణం రెల్లివీధిలో నివాసం ఉంటున్న అశ్వని, సుమన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కూతుళ్లలో ఒకరు బీఫార్మసీ, ఇంకొకరు ఇంటర్ చదువుతున్నారు.
తల్లికి వెళ్లొస్తానని చెప్పి నిర్జీవంగా వచ్చాడు
పాఠశాల ప్రహరీ కూలి విద్యార్థి దుర్మరణం
మరో విద్యార్థికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రులు లోకేష్, సంధ్యారాణి
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటన
గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం ఆదేశాలు
‘అమ్మా.. నేను బడికి వెళ్లొస్తా’ అని చెప్పాడు. నవ్వుతూ.. ఉత్సాహంగా బడికి వెళ్లాడు. నాలుగు గంటలు గడిచాక ఆ కన్నవారికి పిడుగులాంటి సమాచారం. తేరుకోలేక కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి వెళ్లేసరికి రక్తసిక్తమైన దేహంతో కనిపించాడు. ఇలా అవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. ‘ఇప్పుడే కదరా వెళ్లొస్తానని చెప్పావు. లేరా నాన్నా’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకు దక్కకుండా పోయాడంటూ శోకసంద్రంలో మునిగి పోయారు.
సాలూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణం రెల్లివీధిలో నివాసం ఉంటున్న అశ్వని, సుమన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కూతుళ్లలో ఒకరు బీఫార్మసీ, ఇంకొకరు ఇంటర్ చదువుతున్నారు. కొడుకు తుపాకుల అరుణ్‌తేజ (15) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద వెళ్లొస్నాని తల్లికి చెప్పి స్కూలుకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రహరీ ఎక్కి ఆటలాడుకుంటున్నాడు. అయితే ప్రహరీ ఉన్నఫలంగా కూలిపోవడంతో అరుణ్‌తేజతో పాటు అదే తరగతి చదువుతున్న సొండి యాకోబుకు గాయాలు అయ్యాయి. స్కూలు సిబ్బంది ఇద్దరినీ పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అరుణ్‌తేజ అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. సొండి యాకోబు చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అరుణ్‌తేజ తల్లిదండ్రులు అశ్వని, సుమన్ ఆసుపత్రికి వచ్చారు. నిర్జీవమైన కొడుకును చూసి తట్టుకోలేక పోయారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అరుణతేజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా తల్లిదండ్రులతోపాటు బంధువులు, వీధివాసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్టెచర్‌పై తీసుకుని వచ్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల హెచ్‌ఎం జ్యోతితోపాటు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. పట్టణ సీఐ అప్పలనాయుడు వచ్చి వారికి నచ్చజెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, ఆర్డీవో మాధురి కూడా వచ్చి విద్యార్థి తల్లిదండ్రులతోపాటు పాఠశాల సిబ్బందితో మాట్లాడారు.
మంత్రి నారా లోకేష్ దిగ్ర్భాంతి
ఈ ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె వెంటనే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లారు. లోకేష్ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తర్వాత ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.