అది చెరువు కాదు.. మా భూమి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:15 AM
డోలపేట లోని సర్వే నెం.103లో 5.90 ఎకరాల కొత్తచెరువు గర్భా న్ని ఆక్రమించి కొందరు ప్రహరీ నిర్మించారంటూ అదే గ్రామానికి చెందిన పలువురు ఈనెల 14న ధర్నా చేయ డంపై కొందరు గురువారం స్పందించారు.
తప్పుడు ధర్నాలు ఆపాలి
డోలపేటలో నిరసన
రాజాం రూరల్, జూలై 16(ఆంధ్రజ్యోతి): డోలపేట లోని సర్వే నెం.103లో 5.90 ఎకరాల కొత్తచెరువు గర్భా న్ని ఆక్రమించి కొందరు ప్రహరీ నిర్మించారంటూ అదే గ్రామానికి చెందిన పలువురు ఈనెల 14న ధర్నా చేయ డంపై కొందరు గురువారం స్పందించారు. తమ వద్ద ఉన్న పట్టాలు, హక్కుపత్రాలతో రాజాంలో విలేకర్లతో మాట్లాడారు. వారిచ్చిన సమాచారం ప్రకారం.. 1976లో పెయ్యల వెంకయ్యకు 1.50 ఎకరాలు, తామరాపల్లి సన్యాసికి 2.90 ఎకరాలు, తామరాపల్లి రామారావుకు 1.50 ఎకరాలు స్థలం మంజూరు చేసి ప్రభుత్వం పట్టాలిచ్చింది. అయితే అదే ప్రదేశంలో వసతిగృహం నిర్మాణం కోసం తామరాపల్లి సన్యాసి నుంచి 50 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. నాటి నుంచి నేటి వరకూ ఆ మూడు కుటుంబాలు భూమిని సాగుచేసుకుంటూ, జీవనం సాగిసున్నారు. గతంలో 50 సెంట్లులో నిర్మించిన వసతిగృహం శిథిలం కావడంతో కొట్టివేసి అదే స్థలంలో నిర్మించిన భవనంలో ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో తామరాపల్లి సన్యాసి మృతి చెందడంతో అతని మనువడు రమేష్, పెయ్యల వెంకయ్య మృతి చెందడంతో అతని కోడలు రమణమ్మతో పాటు తామరాపల్లి రామారావు భూహక్కుదారులుగా కొనసాగుతున్నారు.
మా స్థలంలోకి రానివ్వడం లేదు..
దేవదాయశాఖ భూముల్లో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించుకుని ఆ దాయం పొందుతున్న డోలపేటకు చెందిన కొందరు వ్యక్తులు.. దశాబ్దాలుగా తమకు చెందిన భూమిలో సాగు చేసేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని, పంటవేస్తే ధ్వంసం చేస్తున్నారని, తమ స్థలంలో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రస్తుత సాగుదారులు రామారావు, రమేష్, రమణమ్మ ఆరోపించారు. తమ స్థలంలోకి రానివ్వడం లేదని కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదుచేస్తే.. అడ్డుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈక్రమంలో స్థలం చుట్టూ ప్రహారీ నిర్మించామని వారు స్పష్టంచేశారు.
ఆ భూమికి పట్టాలున్నాయి..
సర్వే నెం.103లోని 5.90 ఎకరాలు అన్ ఎసెస్‌డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా 1959లో రికార్డుల్లో నమోదైంది. దాన్ని ముగ్గురికి డీపట్టాలు ఇచ్చారు. పట్టాలున్నాయి. ఆ సర్వే నెంబర్‌కు గత తహసీల్దార్ వై.శ్రీనివాసరావు వెబ్ ల్యాండ్‌లో మ్యుటేషన్ చేశారు. ఆ స్థలంపై బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లు ఆధారాలున్నాయి. ఇదే స్థలంలో గతంలో అర్బన్‌హెల్త్ సెంటర్ నిర్మించారు. తాజాగా మరో హాస్టల్ కోసం స్థలం కేటాయిస్తున్నాం.. పీజీఆర్ ఎస్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థల పరిశీలన చేసి, రాజాం పొలీసులకు నివేదించాను.
- రాజశేఖర్, తహసీల్దార్, రాజాం