ఆ ఎరువులు మక్కువ నుంచే
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:34 AM
కొట్టుపరువు గ్రామంలో ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన పొటాష్ ఎరువుల కేసులో తీగలాగితే డొంక కదిలింది.
కొట్టుపరువులో పట్టుకున్న అక్రమ నిల్వలపై విచారణ
గ్రంధి గున్నరాజు ట్రేడర్స్‌లో కొన్నట్లు తేలిన వైనం
తనిఖీలు చేసిన ఆర్డీవో, జిల్లా వ్యవసాయాధికారి
నిల్వలు, రికార్డుల్లో తేడాలు ఉండడంతో షాపు సీజ్
మక్కువ, జూలై 23(ఆధ్రజ్యోతి): కొట్టుపరువు గ్రామంలో ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన పొటాష్ ఎరువుల కేసులో తీగలాగితే డొంక కదిలింది. వీటిని మక్కువలోని గ్రంధి గున్నరాజు ట్రేడర్స్ షాపులో కొన్నట్లు తేలడంతో పార్వతీపురం ఆర్డీవో కె.మాధురి, జిల్లా వ్యవసాయశా ఖాధికారి ఆర్.అన్నపూర్ణ గురువారం మక్కువలోని గ్రంధి గున్నరాజు ట్రేడర్స్‌కు చెందిన ఎరువుల దుకాణం, గోదామును తనిఖీ చేశారు. ఇటీవల సాలూరు మండలం మావుడి రైతుసేవాకేంద్రం పరిధిలోని కొట్టుపరువు గ్రామంలో సత్తి శ్రీనివాసరెడ్డి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 1,596 బస్తాల పొటాష్‌ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆ ఎరువులను మక్కువకు చెందిన గ్రంధి గున్నరాజు వద్ద కొనుగోలు చేసినట్లు సదరు రైతు అధికారులకు వాంగ్మూలం ఇవ్వడంతో ఆర్డీవో, జిల్లా వ్యవసాయాధికారి ఈ తనిఖీలు చేశారు. గోదాములో ఉన్న బస్తాలకు, రికార్డులకు వ్యత్యాసం ఉండడంతో పాటు నిర్వాహకులు సరైన వివరణ ఇవ్వక పోవడంతో అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. జిల్లా వ్యవసాయాఽధికారి మాట్లాడుతూ గ్రంధి గున్నరాజు ట్రేడర్స్ షాపుపై 6ఏ కేసును కూడా నమోదు చేసినట్లు చెప్పారు. ఎరువుల నమూనాలను సేకరించి తాడేపల్లిగూడెం, బాపట్లలోని ల్యాబ్‌లకు పంపుతున్నట్లు తెలిపారు తనిఖీల్లో సాలూరు ఏడీఏ జి.సత్యవతి, క్వాలిటీ కంట్రోల్ ఏవో రవీంద్ర, ఏవో ఏవో భారతి పాల్గొన్నారు.