Share News

ఆ రోడ్డంతా గోతులే

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:25 AM

జిల్లా కేంద్రంలోని మూడు లాంతర్ల నుంచి కొత్తపేట నీళ్లట్యాంకుకు వెళ్లే రోడ్డు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది.

 ఆ రోడ్డంతా గోతులే
అంబటిసత్రం కూడలి, కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద రహదారిపై ఏర్పడిన గోతులు

- పైపులైన్‌ పేరిట తవ్వేసి వదిలేస్తున్న వైనం

- వాహనచోదలకు తప్పని ఇబ్బందులు

విజయనగరం టౌన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మూడు లాంతర్ల నుంచి కొత్తపేట నీళ్లట్యాంకుకు వెళ్లే రోడ్డు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మార్గంలో ప్రధాన తాగునీటి పైపులైన్‌ ఉంది. వారంలో కనీసం రెండుసార్లు ఎక్కడో ఒకచోట లీక్‌ అవుతుంటుంది. దీంతో మునిసపిల్‌ సిబ్బంది ఆ ప్రాంతాల్లో రహదారిని తవ్వి పైపులైన్‌ మరమ్మతులు చేస్తున్నారు. ఆ తరువాత ఆ గోతులను తారుతో కాకుండా మొక్కుబడిగా మట్టి, సిమెంట్‌ బుగ్గితో కప్పేసి వెళ్లి పోతున్నారు. దీంతో వర్షం పడగానే సిమెంట్‌ బుగ్గి కరిగిపోయి గొయ్యిలా మారుతుంది. ప్రధాన రహదారిని కలుపుకొని వీధుల్లో ఉన్న రోడ్లు కూడా 70శాతం గుంతలుగా మారాయి. వర్షాలకు ఈ గోతుల్లో నీరు చేరుతుండడంతో అవి కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా నీరు నిల్వ ఉండిపోతుండడంతో దోమలు వ్యాప్తిచెంది రోగాల బారినపడుతున్నామని, దుర్వాసనతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని స్ధానికులు వాపోతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి

అంబటిసత్రం కూడలిలో బాగున్న రోడ్డును పైపులైన్‌ మరమ్మతుల పేరుతో తవ్వేసి బుగ్గితో కప్పేసి వెళ్లిపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తరువాత బాగు చేస్తామంటున్నారు. గోతులతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు పూర్తిగా మరమ్మతులు చేపట్టాలి.

-సంతోష్‌, ఏసీ షోరూం నిర్వాహకుడు, అంబటిసత్రం కూడలి

గోతులను గుర్తించాం

నగరంలో రహదారులపై ఉన్న గోతులను గుర్తించాం. త్వరలో పైడితల్లి అమ్మవారి పండుగ ఉండడంతో పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతాం. అంత వరకూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతాం.

-బాలాస్వామి, కమిషనర్‌, విజయనగరం

Updated Date - Sep 19 , 2026 | 12:25 AM