Share News

ఆ రోజు ఊరంతా పండగే

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:28 PM

స్వాతంత్య్ర ఉద్యమాన్ని కళ్లారా చూసిన వారు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

 ఆ రోజు ఊరంతా పండగే
చింతాడ పోలీస్‌, ఇందుకూరి సూర్యనారాయణరాజు

- స్వాతంత్య్రం వచ్చినట్లు రేడియోలో విన్నాము

- గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం

- జాతీయ జెండాలు పట్టుకుని పరుగులుతీశాం

- నాటి స్మతులను గుర్తుచేసుకున్న అప్పటితరం

ఎస్‌.కోట రూరల్‌/గజపతినగరం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమాన్ని కళ్లారా చూసిన వారు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం రాక ముందు.. బ్రిటీష్‌ పాలనలో భారతీయులు పడిన కష్టాలను తలచుకున్నారు. ఆంగ్లేయులు తమను బానిసలుగా చూసిన విధానాన్ని ఇప్పటి తరానికి చెబుతున్నారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీజీ, నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో దేశ నాయకులు పోరాటం చేశారు. చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ రోజును ఎన్నటికీ మరచిపోలేమని, ఆ రోజు ఊరూరా పండుగ చేసుకున్నామని అప్పటితరం వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వారి గురుతులతో కథనం..

గాంధీని దూరం నుంచి చూశా..

‘బ్రిటీష్‌ కాలంలో భయంతో బతికేవాళ్లం. తినడానికి తిండి దొరికేదికాదు. బ్రిటీష్‌ వారిని ఎదురించలేక ఎన్నో కష్టాలు చవి చూసేవాళ్లం. స్వాతంత్య్రం రాకముందు పండగలు చేసుకోవడానికి అనుమతులు ఉండేవి కాదు. ఇంటిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించుకొనేవాళ్లం. 1939లో విశాఖపట్నానికి మహాత్మాగాంధీ వచ్చినప్పుడు మా నాన్న నాకు ఆయన్ను దూరంనుంచి చూపించారు. అప్పటికి నేను ఆరోతరగతి చదువుతున్నాను. చిన్నతనంలో పన్నులు ఎలా విధించేవారు తెలియని పరిస్థితి. స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీజీ శాంతియుతంగా చేపట్టేవారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినట్లు రేడియోలో ప్రచారం చేశారు. దీంతో అప్పట్లో గ్రామాల్లో పెద్దఎత్తున సంబరాలు నెలల తరబడి జరిగేవి. పత్రికలు పెద్దగా ఉండేవి కావు. జమీందారు ఇళ్లల్లో రేడియోలు ఉండేవి. రేడియోలో వచ్చిన వార్తలను వారు గ్రామస్థులకు చెప్పేవారు. ఆ విధంగా సమాచారం తెలుసుకొనేవారు.’ అని గజపతినగరం పట్టణానికి చెందిన రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ చింతాడ పోలీస్‌ తెలిపారు. ఈయన స్వగ్రామం బొబ్బిలి మండలం రాముడువలస. 1927 ఆగస్టు11న జన్మించారు. 99ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన పనులను ఎవరి సాయం లేకుండా సొంతంగా చేసుకుంటున్నారు.

జాతీయ జెండాలతో పరుగులు తీశాం

‘బ్రిటీష్‌పాలన అంటే ఆ రోజుల్లో అప్పుడప్పుడు మిలట్రీమాదిరిగా జవాన్లు వచ్చివెళ్లేవారు. స్వాతంత్య్ర పోరాటంలో విజయనగరం మహారాజుల వెంట ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు తిరిగాను. ప్రతిరోజూ ఉదయం విజయనగరం వెళితే మహారాజు మమ్మల్ని జాతీయజెండాలు పట్టుకొండి అనేవారు. అవిపట్టుకుంటే ఎనలేని ఉత్సాహం వచ్చేది. వాటిని పట్టుకొని భరతమాతకు జై అంటూ తిరిగిన జ్ఞాపకాలు ఇంకా నా కళ్లముందే ఉన్నాయి. వందల సంఖ్యలో వచ్చి మీటింగ్‌లు వినేవాళ్లం. స్వాతంత్య్రం మరికొద్ది నెలల్లో వస్తుందనగా విశాఖపట్నంపై బ్రిటీష్‌ వారు దాడిచేస్తారని ప్రచారం జరిగింది. దీంతో చాలామంది యువకులు తుపాకులు పట్టుకొని కొండలపై కాపుకాస్తే, మరికొందరు గ్రామాల్లో కర్రలు పట్టుకొని తిరిగిన విషయం నాకు ఇంకా గుర్తు ఉంది. ఈ విషయం తెలిసిన బ్రిటీష్‌ వాళ్లు వెనక్కి వెళ్లిపోయారని అప్పటి పెద్దలు చెప్పారు. గాంధీజీ విజయనగరం వచ్చినప్పుడు నేను చూడలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. స్వాతంత్య్ర వచ్చిందని రేడియోలో విని జాతీయ జెండాలతో పరుగులు తీశాం. ఆ ఆనందం ఇప్పటికి మరిచిపోలేను. మహాత్ముడిని గాడ్సే చంపిన రోజు నేను అన్నపానీయాలు కూడా ముట్టలేదు. ఆనాడు విజయనగరం రాజులు ఇచ్చిన భూములు సాగు చేశాం. వాటికి మాకు పన్నులు వేసిన దాఖాలాలు లేవు.’ అని ఎస్‌.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ కృష్ణమహాంతిపురం గ్రామానికి చెందిన 104ఏళ్ల వృద్దుడు ఇందుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు.

Updated Date - Aug 14 , 2026 | 11:28 PM