తల్లికి వందనం: నేటి నుంచి నిధుల జమ.. విజయనగరం జిల్లాలో 1.54 లక్షల మందికి లబ్ధి
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:13 AM
'Thalliki Vandanam' – Happiness for the family. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం అమలుకు వేళ అయింది. ఏటాలాగే ఈ ఏడాది కూడా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నిధులను జమ చేయనుంది. ఈ నెల 22 నుంచి తరగతుల వారీగా నాలుగు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.
‘తల్లికి వందనం’
కుటుంబానికి ఆనందం
నేటి నుంచి పథకం అమలు
1,54,612 మంది లబ్ధిదారులు
విడుదలకానున్న రూ 201 కోట్ల నిధులు
ఒకటి, ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఆగస్టు 30న జమ
గజపతినగరం/ విజయనగరం కలెక్టరేట్, జూలై21(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం అమలుకు వేళ అయింది. ఏటాలాగే ఈ ఏడాది కూడా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నిధులను జమ చేయనుంది. ఈ నెల 22 నుంచి తరగతుల వారీగా నాలుగు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,54,612 మందికి లబ్ధి చేకూరనుంది. కుటుంబంలో చదువుకొనే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ ఈపథకం వర్తిస్తుంది. ఒక విద్యార్థికి రూ.15వేలు కాగా పాఠశాల నిర్వహణకు రెండు వేలు మినహాయించి తల్లుల ఖాతాలో రూ,13వేలు జమచేయనున్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూలు, కాలేజీ విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. కాగా 1వ తరగతి, ఇంటర్ కొత్త అడ్మిషన్ తీసుకున్న వారికి ఆగస్టు 30న నిఽధులు విడుదల చేయనుంది.
గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం పేరిట రూ.15వేలు(రెండు వేలు మినహా) అందించింది. కూటమి ప్రభుత్వం కుటుంభంలో ఎంత మంది చదువుకొనే పిల్లలుంటే అందరికీ రూ.15వేలు అందిస్తోంది. పాఠశాల నిర్వహణకు రూ,2వేలు మినహాయించి రూ.13 వేలు జమచేయనుంది. ఈలెక్కన ఒకే కుటుంబంలో ఇద్దరుంటే రూ.26వేలు ముగ్గురుంటే రూ.39వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమచేయనుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో నాలుగు రోజుల వ్యవధిలోనే అందరి తల్లుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తారు.
చెక్ చేసుకోండిలా..
ఈ పథకానికి మీరు అర్హులా.. కాదా అనేది ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఎన్‌బీఎం/బీఎం-ఎస్‌జీఎస్‌డబ్యూపోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. తల్లి ఆధార్ నెంబర్ ఒటీపీ సహాయంతో కొన్ని నిమిషాల్లో ఎలిజిబులిటీ స్టేటస్ తెలుసుకోవచ్చు. అందుకు మీవద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర్హతపై సందేహాలుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది.
- తల్లికి వందనం పథకం ద్వారా నగదు జమ కావాలంటే లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకై ఉండాలి. బ్యాంక్ ఖాతా ఈకేవైసీపూర్తి చేసి ఉండాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్‌గా ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల రికార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు సరిగా నమోదై ఉండాలి.
ఇవీ అర్హతలు
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.లక్షా20వేలు , పట్టణాల్లో రూ.లక్షా44వేల లోపు ఉండాలి. కుటుంబనికి విధిగా రేషన్ కార్డు ఉండాలి. పది ఎకరాల లోపు మాత్రమే భూమి కలిగి ఉండాలి. బియ్యంకార్డులో ఉన్నవారి పేరిట నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. విద్యార్థి వార్షిక హాజరు75శాతానికి తగ్గకూడదు. ఆ కుటుంబం విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.
---------------------