Share News

‘Thalliki Vandanam’ for more people మరింత మందికి ‘తల్లికి వందనం’

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:19 AM

‘Thalliki Vandanam’ for more people జిల్లాకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపు, తల్లికి వందనం పథకం పరిధి విస్తరణ, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలకు ఆమోదం లభించింది.

‘Thalliki Vandanam’ for more people  మరింత మందికి ‘తల్లికి వందనం’

మరింత మందికి ‘తల్లికి వందనం’

- ఆశా వర్కర్లకు రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ

- హాస్టళ్ల విద్యార్థుల డైట్‌ చార్జీలు 10 శాతం పెంపు

- 45 రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యలకు చెక్‌

- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్‌ చార్జీల పెంపు, తల్లికి వందనం పథకం పరిధి విస్తరణ, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలకు ఆమోదం లభించింది.

ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ భరోసా

గ్రామీణ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. విధుల్లో ఉండగా మరణించే ఆశా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రతి ఏడాది సర్వీసుకు రూ.5000 చొప్పున గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలోని ఆశా వర్కర్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

డైట్‌ చార్జీలు పది శాతం పెంపు

నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రతి నెలా అందించే డైట్‌ చార్జీలను పది శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలు అక్టోబరు ఒకటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు విద్యార్థులకు సమతుల్య, నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంటుంది.

తల్లికి వందనం.. మరింతమందికి

పేద విద్యార్థుల చదువులకు అండగా నిలుస్తున్న తల్లికి వందనం పథకం పరిధిలోకి జిల్లాకు చెందిన మరింత మంది చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 50,300 మంది విద్యార్థులను పథకం పరిధిలోకి తీసుకువస్తూ ఇచ్చిన పరిపాలనా అనుమతులను కేబినెట్‌ ర్యాటిఫై చేసింది. తొలి విడతలో సాంకేతిక కారణాలతో పథకం అందని జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు రెండో దశలో లబ్ధి చేకూరనుంది.

ఉద్యాన రైతులకు స్మార్ట్‌ సేవలు

మామిడి, జీడిమామిడి, కొబ్బరి తదితర ఉద్యాన పంటలకు పేరుగాంచిన విజయనగరం జిల్లా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యాన పంటల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించేందుకు ఆధునిక సాంకేతికతతో ‘ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ ఏర్పాటుఉ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా రైతులకు సకాలంలో సలహాలు, వాతావరణ సమాచారం అందే అవకాశం ఉంది.

45 రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యలకు చెక్‌

ఇళ్ల స్థలాల సమస్యలతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ సమస్యలన్నింటినీ 45 రోజుల్లో పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకుని వదిలేసిన స్థలాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి.. వాటిని జిల్లాలోని నిజమైన అర్హులకు తిరిగి కేటాయించే ప్రక్రియను కమిటీ పర్యవేక్షించనుంది. కొత్తగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి భూసేకరణ ఎలా చేపట్టాలన్న అంశంపైనా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

----------------

Updated Date - Oct 08 , 2026 | 12:19 AM