'Tet' is mandatory ‘టెట్’ తప్పనిసరి
ABN , Publish Date - May 31 , 2026 | 12:11 AM
'Tet' is mandatory సర్వీసు టీచర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పదోన్నతులు ఆశించే ప్రస్తుత ఉపాధ్యాయులతోసహా, ఉద్యోగంలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని పునరుద్ఘాటించింది. గతేడాది ప్రతీ టీచర్ తప్పనిసరిగా టెట్‌పాస్ కావాలని, అప్పుడే ఉద్యోగోన్నతికి అర్హులని తేల్చింది.
‘టెట్’ తప్పనిసరి
స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం
అర్హత సాధనకు మరో ఏడాది గడువు పెంపు
ఉపాధ్యాయుల్లో గుబులు
బొబ్బిలి, మే 30(ఆంధ్రజ్యోతి): సర్వీసు టీచర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పదోన్నతులు ఆశించే ప్రస్తుత ఉపాధ్యాయులతోసహా, ఉద్యోగంలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని పునరుద్ఘాటించింది. గతేడాది ప్రతీ టీచర్ తప్పనిసరిగా టెట్‌పాస్ కావాలని, అప్పుడే ఉద్యోగోన్నతికి అర్హులని తేల్చింది. రెండేళ్లులోగా పాస్ కావాలని, లేదంటే సర్వీసు నుంచి తొలగించవచ్చని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా సీనియర్ ఇన్ సర్వీసు టీచర్లు.. విద్యాహక్కు చట్టం 2010 నుంచి అమలులోకి వచ్చిందని, అంతకుముందే డీఎస్సీలో ఎంపికైనవారికి టెట్ నిబంధన పెట్టడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై పిటిషన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా ఉద్యమాలు చేపట్టారు. సుప్రీంలో రిట్ ఫిటిషన్ వేశారు. అక్కడ వాదోపవాదాలు ముగిసిన తర్వాత శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ టీచర్ టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. టెట్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. టెట్ పాస్ కావడానికి గతంలో రెండేళ్ల సమయం ఇవ్వగా, తాజాగా మరో ఏడాది గడువు పొడిగించింది. 2028 ఆగస్టు 31వ తేదీలోగా టెట్ అర్హత సాధించాలని స్పష్టం చేసింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై, పదవీ విరమణకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని పేర్కొంది.
2010 డీఎస్సీ నుంచి ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. అంతకు ముందు నియమించిన ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అవసరం. జిల్లాలో 1998 నుంచి 2003 వరకు నిర్వహించే డీఎస్సీల్లో ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులను నియమించారు. జిల్లాలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు వేలల్లో ఉన్నారు. గతేడాది నిర్వహించిన టెట్‌కు.. ఇన్‌సర్వీసులో ఉన్న వారు 30శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వందల సంఖ్యలో మాత్రమే టెట్‌కు అర్హత సాధించారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో మళ్లీ గుబులు రేగుతోంది. ఈ వయసులో పరీక్షలు ఎలా రాసేదెలా అంటూ.. 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
ఇది చాలా అసంబద్ధమైన నిబంధన
గంట సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘనేత, బొబ్బిలి
విద్యాహక్కుచట్టం రాక మునుపు 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టెట్ నిబంధన పెట్టడం అసంబద్ధమైనది. ఉపాధ్యాయశిక్షణలో ఉత్తీర్ణత సాధించి డీఎస్‌సీలో అత్యధిక మార్కులు సాధించిన వారికే ఉపాధ్యాయ ఉద్యోగంలో నియమించారు. అలా వృత్తిలో చేరిననాటి నుంచి అనేక రకాల వృత్యంతర శిక్షణలు ఇచ్చారు. 20 నుంచి 30 సంవత్సరాల వరకు సర్వీసును పూర్తి చేసుకున్న వారి అపారమైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా అన్యాయం.
---------------