పరీక్షిస్తున్నా.. ఫలితాలేవి?
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:17 AM
భూసారం ఎలా ఉంది? నేల ఏ పంటలకు అను కూలం?ఎంత మేర ఎరువులు వాడితే సరిపోతుంది? తదితర విషయాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన మట్టి నమూనాలు సేకరణ వరకే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి.
భూసారం ఎలా ఉంది? నేల ఏ పంటలకు అను కూలం?ఎంత మేర ఎరువులు వాడితే సరిపోతుంది? తదితర విషయాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ చేపట్టిన మట్టి నమూనాలు సేకరణ వరకే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా రైతులు స్పందిస్తున్నారు. అసలు అధికారులే రావడం లేదంటున్నారు. వచ్చినా మట్టి పరీక్షల ఫలితాలు చెప్పడం లేదని చెబుతున్నారు. ఇలా అయితే భూసారం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.
విజయనగరం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అధిక దిగుబడులకు ఆశపడి రైతులు అవగాహన లోపం తో ఇష్టారాజ్యంగా ఎరువులను విని యోగిస్తున్నారు. దీనివల్ల దిగుబడుల మాట పక్కనపెడితే దుష్ప్రభావాలతో పంటలు ఎక్కువగా నాశనం అవుతున్నాయి. భూమి నిస్సారమవుతోంది. మేలు కలిగించే మిత్రపురుగులకు హాని కలుగుతోంది. అందుకే భూసార పరీక్షలతో నేల సారాన్ని అంచనా వే సి.. ఎరువులను సూచించాలని సిబ్బందికి వ్య వసాయశాఖ చెబుతుంటుంది. ఆ ప్రకారం ఎంపిక చేసిన పొలాల్లో మట్టిని సేకరించి విజ యనగరంలోని పరీక్ష కేంద్రానికి పంపించి.. ఫలితాల కార్డును రైతులకు అందించాలి. ఏటా ఖరీఫ్, రబీ పంటలకు ముందు ఈ భూ సార పరీక్షలు తప్పనిసరి. జిల్లాలో రబీ కంటే ఖరీఫ్‌లో పంటలు ఎక్కువగా పండిస్తారు. రబీలో ఆరుతడి, వాణిజ్య పంటలు వేస్తారు. కానీ ఈ రెండు సీజన్లలో అసలు భూసార పరీక్షలు సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఏదో అలా చేస్తున్నారు అన్నట్టు పరీక్షల తంతును ముగిస్తున్నారు.
గత ఏడాది అలా..
జిల్లాలోని 27 మండలాల్లో గత ఖరీఫ్‌లో 31,000 మట్టి నమూనాలు సేక రించాలని నిర్ణయించారు. వారానికి 5000 శాంపిల్స్ చొప్పున సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికి ఇంకా 11000 సేకరించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో మండలాల వారీగా లక్ష్యా లను విధించారు. అయితే లక్ష్యం మేరకు సేకరించలేదని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కొన్ని మండలాల్లో మట్టి నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి పంపించారే తప్ప రైతులకు ఫలితాల పత్రాలు అందించలేదన్నది ప్రధాన విమర్శ. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లక్ష్యాలను విధించారు. సాధారణంగా మేలో వేసవి దుక్కులు, జూన్‌లో వరి విత్తనాలు వేయడంతో ఖరీఫ్ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో మెట్ట ప్రాంతంలో.. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తుంటారు. దానికి కూడా ఎలాంటి భూమిలో వేస్తే దిగుబడి వస్తుంది? దుక్కులు ఎలా చేయాలి? ఏ ఎరువు వాడాలి? అనే విషయాలు భూసార పరీక్షలు ద్వారానే తెలుస్తాయి. అందుకే ఈ ఏడాది అయినా సకాలంలో మ ట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
జీపీఎస్ యాప్‌తో..
జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన భూసార పరీక్షల్లో ప్రధానంగా సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్, ఐరన్ లోపాలను గుర్తించారు. తాజాగా పరీక్షలు చేపడితే భూమిలో నత్రజని, మాంగనీసు, బోరాన్, జింక్, ఇనుము, పొటాష్, రాగి, భాస్వరం, ఉదజని, ఇతర సూక్ష్మ పోషకాలు ఎంతమేర ఉన్నయో తెలుస్తుంది. ఈ సారి పక్కాగా నిర్వహించేందుకు జీపీఎస్ యాప్‌ను తీసుకొచ్చారు. పొలంలో నమూనా సేకరణకు సంబంధించి అంతా కనిపించేలా రైతుతో సెల్ఫీ ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్, రబీలకు సంబంధించి కనీసం మూడు, గరిష్టంగా ఆరు పంట భూముల్లో పరిశీలించాలని..గతంలో సేకరించిన భూములకు వెళ్లకూడదని ఆదేశాలు ఉన్నాయి.
జూన్ నాటికి ఫలితాల కార్డులు..
ఈ ఏడాది మే నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తిచేయాలని నిర్ణయించాం. జూన్ నాటికి ఫలితాల కార్డులను రైతులకు అందిస్తాం. సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించి రైతులను అప్రమత్తం చేస్తాం. అంతిమంగా పంట దిగుబడులు పెంచడమే లక్ష్యం. మోతాదుకు మించి ఎరువులు, రసాయనాలను వినియోగించకూడదని రైతులకు అవగాహన కల్పిస్తాం.
-వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి