Share News

అధ్వానంగా పారిశుధ్యం

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:05 AM

పాలకొండ నగర పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఎటుచూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.

అధ్వానంగా పారిశుధ్యం
నెయ్యిలవీధి కూడలి వద్ద పేరుకుపోయిన చెత్త

- పాలకొండలో వీధుల్లోనే చెత్త డంపింగ్‌

- పట్టణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

-పట్టించుకోని నగర పంచాయతీ అధికారులు

పాలకొండ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఎటుచూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా దోమలు విజృంభిస్తుండడంతో స్థానికులు రోగాల బారినపడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బ్లీచింగ్‌ చల్లాల్సిన శానిటరీ విభాగం ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పాలకొండలో శాశ్వత డంపింగ్‌ యార్డు లేకపోవడంతో పట్టణంలో సేకరించిన చెత్తను దూబవీధి, నెయ్యిలవీధి కూడళ్ల వద్ద రోడ్డుపైనే పారబోస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు ‘మేము వీధుల్లో ఉన్నామా? డంపింగ్‌ యార్డు వద్ద ఉన్నామా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆకతాయిలు ఇక్కడి చెత్తకు నిప్పు పెట్టడంతో పొగతో ప్రజలు రాత్రంతా అవస్థలు పడ్డారు. నగర పంచాయతీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతం నుంచి ఈ చెత్తను తరలించాలని ఇప్పటికే అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:05 AM