Share News

tension on third railway line నెల్లిమర్ల ప్రజల్లో మూడోలైన్‌ గుబులు

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:21 AM

tension on third railway line నెల్లిమర్ల మీదుగా వెళుతున్న చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంలో విజయనగరం నుంచి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా వరకు మూడో లైను వేయాలని రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో రైలు పట్టాలకు సమీపంలో నివసిస్తున్న వారిలో గుబులు రేగింది. ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, ఇంటిని వీడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. భూసేకరణపై ప్రాథమికంగా మాత్రమే సర్వే చేశారు. ఇంకా స్పష్టత రాలేదు.

tension on third railway line నెల్లిమర్ల ప్రజల్లో   మూడోలైన్‌ గుబులు
నెల్లిమర్ల వద్ద హౌరా - చెన్నై రైలు మార్గం

నెల్లిమర్ల ప్రజల్లో

మూడోలైన్‌ గుబులు

రైలు పట్టాల సమీప నివాసితుల్లో ఆందోళన

ఇళ్లు పోతాయని భయం

పూర్తయిన ప్రాథమిక సర్వే

నెల్లిమర్ల మీదుగా వెళుతున్న చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంలో విజయనగరం నుంచి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా వరకు మూడో లైను వేయాలని రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో రైలు పట్టాలకు సమీపంలో నివసిస్తున్న వారిలో గుబులు రేగింది. ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, ఇంటిని వీడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. భూసేకరణపై ప్రాథమికంగా మాత్రమే సర్వే చేశారు. ఇంకా స్పష్టత రాలేదు.

నెల్లిమర్ల, జూలై 6(ఆంధ్రజ్యోతి):

రైల్వే కొత్తలైను ఏర్పాటు కోసం ఏ మేరకు ప్రైవేటు భూమిని సేకరిస్తారో స్పష్టం కాకపోవడంతో నెల్లిమర్ల ప్రజల్లో టెన్షన్‌ కొనసాగుతోంది. హౌరా-చెన్నై రైలు మార్గం దేశంలోనే ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటి కావడంతో పాటు ఈ మార్గంలో నడుస్తున్న రైళ్ల సంఖ్య, ప్రయాణిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ మార్గంలో మూడోలైను అవసరం ఆవశ్యకమైంది. దీంతోపాటు ఇటీవలే విశాఖపట్నం కేంద్రాన్ని కొత్తజోన్‌ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి జోన్‌ అధికారులు రైలు మార్గం విస్తరణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం నుంచి అధికారులు మార్కింగ్‌ ఇవ్వడంతో పాటు అక్కడక్కడ సరిహద్దును స్పష్టం చేస్తూ తాత్కాలిక పోల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే భూమి సరిహద్దు నుంచి సుమారు 30 మీటర్ల వరకు కొత్తగా అవసరం పడుతుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు హద్దులు గుర్తించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖకు లేఖలు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ లేఖలకు స్పందనగా నెల్లిమర్ల మండల రెవెన్యూశాఖకు చెందిన సర్వేయర్లు ఇప్పటికే ఒకసారి తమ వద్దనున్న రికార్డుల ఆధారంగా రైలు పట్టాల వెంబడి నెల్లిమర్ల పరిధిలోని సుమారు నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా ప్రాథమికంగా సర్వే పూర్తిచేశారు. రైల్వే శాఖ కోరుతున్న విధంగా ప్రైవేట్‌ భూమిని సైతం సేకరించి అప్పగిస్తే ఎంతమంది ఇళ్లు కోల్పోనున్నారు... ఎంతమంది పొలాలను అప్పగించాల్సి ఉంటుంది.. తదితర అంశాలపై సర్వేయర్లు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.

నాలుగున్నర కిలోమీటర్ల దూరం వరకు

హౌరా-చెన్నై మార్గంలో నెల్లిమర్ల పరిధిలో డైట్‌ కాలనీ రైల్వేగేటు నుంచి నెల్లిమర్ల జూట్‌ మిల్‌ హద్దు దాటేంతవరకు సుమారు నాలుగున్నర కిలోమీటర్ల నిడివి ఉంది. ఈ ప్రాంతంలో మూడో రైల్వే లైన్‌ ఏర్పాటు కారణంగా సుమారు 50 ఇళ్ల వరకు భూసేకరణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే పూడమ్మవనం సమీపంలోనూ, రామతీర్థం రోడ్డు దాటిన తరువాత నుంచి జూట్‌మిల్లు వద్ద చంపావతి నది వంతెన వరకు కొన్ని ప్రైవేటు భూములు భూ సేకరణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా డైట్‌కాలనీలో రైలు పట్టాలకు సమీపంలో ఉన్న ఇళ్లు, ప్లైఓవర్‌ వంతెన సమీపంలో ఉన్న పలు ఇళ్లు, కార్యాలయాలు, పలు దుకాణాలు, రామతీర్థం రోడ్డు అండర్‌ పాస్‌వే వద్ద ఉన్న పలు దుకాణాలను యజమానులు కోల్పోవాల్సి రావొచ్చు.

- భూములు, ఇళ్లు కోల్పోనున్న యాజమానులు ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాలు పెట్టకుండా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికి సంతృప్తి చెందితే భూసేకరణకు మార్గం సుగమం అవుతుంది. అయితే మూడో రైల్వేలైను కోసం నెల్లిమర్ల ప్రాంతంలో భూసేకరణ పరిధిలో ఏయే ప్రాంతాలు వస్తాయి? ఎంత నష్టపరిహారం అందజేస్తారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎప్పటికప్పుడు సర్వే బృందాలు పట్టాల వెంబడి కనబడడంతో స్థానికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.

భూసేకరణ నిజమే..

కె.శ్రీకాంత్‌, తహసీల్దార్‌

నెల్లిమర్లలోని రైలు మార్గం వెంబడి పట్టాలకు తూర్పువైపున ఏర్పాటు చేయనున్న మూడోలైన్‌ కోసం భూసేకరణ చేసేందుకు రైల్వే శాఖ తమకు లేఖ పంపారు. రైల్వే అధికారులు పంపిన లేఖ మేరకు వారు కోరిన విధంగా భూమిని గుర్తించే చర్యలు చేపడుతున్నాం. సర్వేయర్ల బృందం ప్రాథమికంగా సర్వే చేశారు. తుది నివేదిక తయారు చేయాల్సి ఉంది.

Updated Date - Jul 07 , 2026 | 12:21 AM