Tension in Kottavalasa కొత్తవలసలో ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:52 PM
Tension in Kottavalasa పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ ఆలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి ఘటాల ఊరేగింపు విషయంపై రేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
స్థానికుల నిరసన .. పోలీసుల రంగ ప్రవేశం
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్, ఏప్రిల్22(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ ఆలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్మవారి ఘటాల ఊరేగింపు విషయంపై రేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపోలమ్మ ఘటాలను తమ కాలనీలో ఊరేగించాలని నందమూరి కాలనీవాసులు కొన్ని రోజులుగా కోరుతున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్‌కలెక్టర్ వైశాలితో పాటు ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు వినతపత్రాలు అందించారు. అయితే పూర్వం నుంచి వస్తున్న సంప్రదా యం ప్రకారమే ఘటాల ఊరేగింపు జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం కొత్తపోలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వద్ద నందమూరి కాలనీ, ఉత్సవ కమిటీ తమ తమ వాదనలు వినిపించారు. కొత్తవలసలోని కొన్ని వీధుల్లోనే ఘటాలు తిప్పనున్నట్లు తెలుసుకున్న నందమూరి కాలనీవాసులు రాత్రి 7గంటల సమయంలో కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అమ్మవారి ఘటాలను పొలమేరలు దాటించలేమని ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేయడంతో కాలనీవాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని శాంతింపజేశారు. గురువారం కలెక్టర్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పోలీ సులు చెప్పడం ఉత్సవ కమిటీ సభ్యులలతో పాటు నందమూరి కాలనీవాసులు వెనుదిరిగారు.
పోలీసులతో వాదన
వీధుల్లో తిరగాల్సిన కొత్తపోలమ్మ ఘటాలు రాత్రి 7 గంటల వరకు ఎత్తకుండా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటాల ఊరేగింపు జరపరాదని వారు అనడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వెళ్లకపోతే గ్రామానికి అరిష్టమంటు పోలీసులతో వాదనకు దిగారు. అంతే కాకుండా అమ్మవారి గుడికి తాళాలు వేయడం ఏమిటని మహిళలు ప్రశ్నించారు. ఎప్పటికీ తాళాలు తీయకపోవడంతో పోలీసుల వైఖరి నశించాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా ఘట్టాల ఊరేగింపు విషయంలో కొత్తవలసలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పలు మండలాల నుంచి ఎస్‌ఐలను వెంటనే జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు.
ఉత్సవ కమిటీ రద్దు...
కొత్తవలస పండుగ సందర్భంగా ఏర్పాటైన ఉత్సవ కమిటీ స్వచ్ఛందంగా రద్దు చేసుకుం టున్నట్టు సమాచారం. కమిటీ లేకుండానే పండుగ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏదేమైనా ఘటాల ఊరేగింపు వివాదం ఎటు దారి తీస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసు బందోబస్తు మధ్య బుధవారం రాత్రి 11:30 గంటలకు ఆనవాయితీ ప్రకారం అమ్మవారి ఘటాలను ఊరేగించారు.