Share News

కొట్టక్కిలో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:28 PM

కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని ఏపీఐఐసీ భూముల వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 కొట్టక్కిలో ఉద్రిక్తత
గిరిజనులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కిస్తున్న పోలీసులు

- ఏపీఐఐసీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన అధికారులు

- అడ్డుకున్న గిరిజనులు, నాయకులు

- తీవ్ర వాగ్వాదం.. అరెస్టు చేసి సేష్టన్‌కు తరలించిన పోలీసులు

- ఎక్స్‌కవేటర్లతో భూముల చదును

రామభద్రపురం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని ఏపీఐఐసీ భూముల వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ భూముల విషయమై గిరిజనులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ భూములు తమవని గిరిజనులు చెబుతుంటే.. కాదు వాటిని ఏపీఐఐసీ కేటాయించామని అధికారులు అంటు న్నారు. ఈ మేరకు భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా గిరిజనులు, సీపీపీఎం, ప్రజా సంఘాల నాయకులు అడ్డుతగిలారు. వారిని పోలీ సులు అదుపులోకి తీసుకుని వ్యాన్‌లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అసలు ఏం జరిగిందంటే..

కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 537లో ఉన్న సుమారు 187 ఎకరాల ప్రభుత్వ భూమిని 2017లో ఏపీఐఐసీకి రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఇటీవల ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో సుమారు 60 ఎకరాలను రాధికా వెజిటబుల్‌ పామాయిల్‌ కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో అప్ప టికే సాలూరు మండలం పుల్లేరుగుడ్డివలసకు చెందిన గిరిజనులు కొంతమేర సాగుచేస్తున్నారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో ఏ విధంగా సాగుచేస్తారని గతంలో రెవెన్యూ అధికారులు గిరిజనులను హెచ్చరించా రు. వాటిని వదులు కోవాలని తేల్చి చెప్పారు. అయినా గిరిజనులు వినలేదు.

వివాదం మొదలైంది ఇలా..

ఈ నేపథ్యంలో గిరిజనుల సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులతో కలిసి అధికారులు వచ్చారు. బొబ్బిలి టౌన్‌ సీఐ కింతలి నారాయణరావు, రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, రామభద్రపురం ఎస్‌ఐ వి.జ్ఞానప్రసాద్‌, తెర్లాం, బొబ్బిలి, బాడంగి ఎస్‌ఐలతోపాటు గజపతినగరం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు మోహరిం చారు. విషయం తెలుసుకున్న పుల్లేరుగుడ్డివలసకు చెందిన సుమారు 40 మంది గిరిజనులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూడడ్ల కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, మర్రి శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. 2009లో 17మంది గిరిజనులకు ఆర్‌ఓఎస్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని, ఆ భూములను వదిలేసి ఎంఎస్‌ఎంఈ భూములను సాగు చేయడం సబబుకాదని బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు వారిని ప్రశ్నించారు. అయినప్పటికీ తాము ఇక్కడే పంటలు సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నామని, ఇక్కడే తమకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ చర్చలు జరుగుతుండగానే అధికారులు రాధికా వెజిటబుల్‌కు చెందిన ఎక్స్‌కవేటర్లతో భూముల ను చదును చేయించారు. వద్దని గిరిజనులు ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా వారందరిని అక్కడి నుంచి నెట్టివేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న భూముల కు నష్టపరిహారం ఇవ్వాలని గిరిజనులు కోరగా, ఏపీఐ ఐసీకి కేటాయించిన భూములకు ఏ విధంగా పరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రశ్నించారు. ఈ సమయంలో వారందరినీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో ఎక్కించి బాడంగి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గిరిజనులతోపాటు సీపీఎం నా యకులను అక్రమంగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లడం ఎంత వరకు సమంజసమని సీఐటీయూ నాయకుడు బలసా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:28 PM