బొబ్బిలిలో రెబల్స్ టెన్షన్
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:57 PM
బొబ్బిలి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు రెబల్స్ బెడద ఉంది.
మూడు పార్టీలకు తప్పని బెడద
నామినేషన్లు వేసిన అసమ్మతి నేతలు
బుజ్జగించే పనిలో నేతలు
బొబ్బిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులకు రెబల్స్ బెడద ఉంది. మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనను ఈ రెబల్స్ టెన్షన్ వెంటాడుతోంది. 4వ వార్డుకు మాజీ కౌన్సిలర్ పందిరిపల్లి అమ్మన్నమ్మ కుమారుడు అమర్‌నాథ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. అమ్మన్నమ్మ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గత ఏడాది వైసీపీ చైర్‌పర్సన్ సావు మురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆమె టీడీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో ఆమె కుమారుడు అమర్‌నాథ్ టికెట్ ఆశించారు. కానీ, రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఈ వార్డులో బొత్స సురేష్‌కుమార్(టీడీపీ) పోటీ చేస్తున్నారు.
- 8వ వార్డు నుంచి సిరిపురపు ప్రసాద్, పితాని శ్రీనివాసరావు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరిద్దరూ టీడీపీ సానుభూతిపరులు. ఈ వార్డులో వైసీపీ నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్ బొత్స రమణమ్మకు టీడీపీ టికెట్ దక్కింది.
- 9వ వార్డు గొల్లపల్లి నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ సావు శారద ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి ముడసల చిన్నమ్మలు కూడా ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.
- 12వ వార్డు నుంచి వైసీపీ సీనియర్ నేత సావు కృష్ణమూర్తినాయుడు ఇండిపెండెంట్‌గా, వజ్జి సూరిబాబు ఇండిపెండెంట్‌గా, టీడీపీ నుంచి పిరిడి ఈశ్వరరావు, వైసీపీ నుంచి మండల జనార్దనరావు పోటీలో ఉన్నారు.
- 17వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్‌గా ముడసల దుర్గారావు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా తమ కుటుంబీకులను బరిలో పెట్టాలనుకున్నారు. కాంగ్రెస్ చైర్‌పర్సన్ టికెట్ మువ్వల పద్మావతికి దక్కింది.
- 21వ వార్డు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చెలికాని మురళీకృష్ణ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.
- 22వ వార్డు నుంచి జనసేన టికెట్ ఆశించిన మాజీ కౌన్సిలర్ ఒమ్మి లక్ష్మి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. ఈ వార్డు నుంచి టీడీపీ తరఫున నంది లక్ష్మీమానస పోటీ చేస్తున్నారు.
- 26వ వార్డు నుంచి అప్పికొండ గురుభార్గవి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో తెలుగు మహిళా నాయకురాలు బొద్దల లక్ష్మీఅప్పారావు టికెట్ ఖరా రవుతుందని ఆఖరి నిమిషం వరకూ ఎదురు చూశారు. అనూహ్యంగా ఈ వార్డును జనసేనకు కేటాయించడంతో లోపింటి రాంబాబు పోటీ చేస్తున్నారు.
- మల్లమ్మపేట 28వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ ఇంటి గోవిందరావు బరిలో ఉన్నారు. ఆయన వైసీపీ, టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
- 30 వ వార్డు నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలరు వాడపల్లి వనజకుమారి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ కౌన్సిలర్ కళ్యంపూడి లక్ష్మి బరిలో ఉన్నారు.
- 31 వ వార్డు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలరు మరిపి తిరుపతిరావు పోటీచేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి రెడ్డి సత్యం నిల్చొన్నారు.
- 32 వ వార్డులో ఇద్దరు టీడీపీ రెబల్ అభ్యర్థులు కెల్ల చిన్నారావు, పిల్లా రామారావు ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. ఈ వార్డు జనసేనకు కేటాయించడంతో పైల హరిప్రసాద్ పోటీలో ఉన్నారు.
- 6 వ వార్డు జనసేనకు కేటాయించడంతో కుప్ప శ్యామలరావుకు టికెట్ దక్కింది. ఆక్కడ ఇండిపెండెంట్‌గా గొల్లపల్లి శ్రీనివాసరావు బరిలోఉన్నారు.
బుజ్జగింపులు
రెబల్స్‌ను శాంతింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. భవిష్యత్‌లో ఇంకో రకంగా అవకాశం కల్పిస్తామని నచ్చజెబుతున్నా కొంతమంది వినడం లేదు. తొలుత బుజ్జగిస్తున్నారు. మాట వినకపోతే కన్నెర్ర చేస్తున్నారు. దీంతో తిరుగుబాటుదారులు వేరే గత్యంతరం లేక తమ అధినాయకుల వెంట నడుస్తున్నారు.