Share News

Tension at the Gurukul గురుకులంలో కలకలం

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:23 AM

Tension at the Gurukul కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

Tension at the Gurukul  గురుకులంలో కలకలం
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల

  • ఆసుపత్రిలో నలుగురికి చికిత్స

  • వారిలో ఇద్దరు డిశ్చార్జి

  • ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తినడమే కారణమంటున్న వైద్యులు

కురుపాం,ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాగా ఇటీవల ఈ పాఠశాలలో జాండీస్‌(కామెర్లు) లక్షణాలతో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా.. పదుల సంఖ్యలో బాలికలు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాల విద్యార్థినుల్లో డయేరియా లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెం దుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం గురుకుల పాఠశాలలో గత వారం రోజుల నుంచి ఒకరిద్దరు విద్యార్థినులు డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. కాగా గురువారం రాత్రి కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆరిక ప్రణవి, గొర్లి జహితదేవి, కొండగొర్రి క్రిస్టియన్‌, పొదివాపు నవితలను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో ప్రణవి, జహితదేవిని శుక్రవారం ఉదయం డిశ్చార్జి చేశారు. క్రిస్టియన్‌, నవిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.

ఈ ఘటనపై స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారి తనూజ మాట్లాడుతూ.. ‘ఈ నెల 21న కురుపాం గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలికలు విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఏఎన్‌ఎం ఫోన్‌ చేసిన వెంటనే హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులకు చికిత్స అందించాం. వారు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న బ్రేడ్‌ , పచ్చళ్లను పరిశీలించగా.. అవి పాడైనట్లు తెలిసింది. వాటిని వారు తినడం వల్లే ఆరోగ్యం పాడైంది. గురుకుల పాఠశాలలో వాటర్‌ శాంపిల్స్‌ను పరీక్ష కేంద్రానికి పంపించాం. రిపోర్టు బాగానే వచ్చింది. కొద్దిరోజులుగా పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహస్తున్నాం. అయితే గురువారం నలుగురికి ఆరోగ్యం బాగోలేకపోవడం కురుపాం ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇద్దరిని డిశ్చార్జి చేశాం. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. పాఠశాలలో ఇప్పటికీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం.’ అని తెలిపారు. మరోవైపు కురుపాం ఎంపీడీవో ఉమామహేశ్వరి, తహసీల్దార్‌ జయ, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈఈ నాగేశ్వరరావు, జేఈ వేణుగోపాలరావు తదితరులు గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అక్కడి తాగునీటిని పరీక్షించి.. బాగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఇక జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ హాస్టల్‌లో నిత్యావసరాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఈ పరిశీలనలో గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్‌ బి.ధర్మరాజు, ప్రిన్సిపాల్‌ బి.దాలమ్మ, సీహెచ్‌సీ సూపరెంటెండెంట్‌ సందీప్‌ తదితరులు ఉన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించండి: మంత్రి సంధ్యారాణి

కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినులు డయేరియాతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విజయవాడ నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందిం చాలని సూచించారు. పాఠశాలలో మిగతా విద్యార్థినుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిం చాలని డీఎంహెచ్‌వో భాస్కరరావును ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలన్నారు. పాఠశాలల్లో ఆహార తనిఖీలు కఠినం చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:23 AM