Share News

రేపటి నుంచి ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:09 AM

పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు.

  రేపటి నుంచి ‘పది’ పరీక్షలు
బొబ్బిలిలోని ఓ పరీక్ష కేంద్రంలో బెంచీలపై హాల్‌ టిక్కెట్ల నెంబర్లు వేస్తున్న ఉపాధ్యాయులు

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

- జిల్లాలో 119 కేంద్రాల్లో నిర్వహణ

- హాజరు కానున్న 22,961 మంది విద్యార్థులు

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఏప్రిల్‌ ఒకటో తేది వరకూ జరిగే పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 449 పాఠశాలలు నుంచి 22,961 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 11,487 మంది, బాలికలు 11,474 మంది ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 564 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి, 1210 మంది ఇన్విజరేటర్లను నియమించారు. 119 మంది డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, 110 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 30 మంది అదనపు డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, 7 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను నియమించారు. ప్రశ్న పత్రాల పంపిణీకి 9 రూట్లు, భద్రపరచడానికి 29 పోలీసు స్టేషన్లను కేటాయించారు. ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్‌ సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థి హాల్‌ టిక్కెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను నో ఫోన్‌ జోన్‌గా ప్రకటించారు. ఎవరూ మొబైల్‌ ఫోన్లు తీసుకుని రాకూడదు. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌కు (08922-351399, 7382157686 నెంబర్లు)కు ఫోన్‌ చేయవచ్చు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రశ్నలను జాగ్రత్తగా అర్ధం చేసుకుని స్పష్టంగా రాయాలి. చేతిరాతి బాగుంటే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ విద్యార్థులకు చాలా ఉపయోడుతుంది. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. జిల్లాలో పరీక్షల పర్యవేక్షణకు పరిశీలకులుగా ఆర్‌జేడీ తెహరా సుల్తాన్‌ను ప్రభుత్వం నియమించింది.

-యు.మాణిక్యంనాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి

Updated Date - Mar 15 , 2026 | 12:09 AM