TDP Cadres’ తెలుగు తమ్ముళ్ల ఆవేదన
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:54 PM
Telugu TDP Cadres’ Anguish సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు.
జనసేనకు కేటాయింపుపై లోలోన అసంతృప్తి
కన్నీటిపర్యంతమైన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పొత్తులో త్యాగాలు సహజం: మంత్రి అచ్చెన్నాయుడు
సాలూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనసేనకు కేటాయించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. కార్యకర్తల ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
పట్టణంలోని మంత్రి సంధ్యారాణి నివాసం వద్ద శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాలూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పట్టున్న సమయంలోనూ టీడీపీని బలోపేతం చేసేందుకు కష్టపడ్డామని, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయించడం తమను నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన తమకు పదవులు దక్కకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పొత్తులో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందని, అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని అన్నారు. కార్యకర్తల ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా..
మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉండగా, రెండు మున్సిపాలిటీలను జనసేనకు కేటాయించడం బాధాకరమన్నారు. తన గెలుపు కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
సంధ్యారాణి ఆవేదనను గమనించిన అచ్చెన్నాయుడు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మరోసారి హామీ ఇచ్చారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు డి.రత్నాకర్, ఎస్.వనజాక్షి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తేజోవతి, మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగబాబుతో అచ్చెన్నాయుడు, సంధ్యారాణి భేటీ
సాలూరు పట్టణ సమీపంలోని ఓ గృహంలో ఎమ్మెల్సీ నాగబాబు జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తొలుత ఆయన మంత్రి సంధ్యారాణిని కలవలేదు. ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్నాయుడు నాగబాబుకు ఫోన్ చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు, సంధ్యారాణి నాగబాబు ఉన్న చోటుకు వెళ్లి కొద్దిసేపు చర్చించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు విజయనగరం వైపు వెళ్లగా, సంధ్యారాణి తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ.. సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
శతశాతం విజయం సాధించాలి
పార్వతీపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీలో శతశాతం కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం పార్వతీపురంలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌన్సిలర్లతో పాటు చైర్పర్సన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, జడ్పీ పీఠాన్ని కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సరైన సమయంలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. దీనిలో భాగంగానే పలు జిల్లాల్లో గొడవలు సృష్టిస్తోందన్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించాలని చూస్తోందన్నారు. సాలూరులో చైర్పర్సన్ స్థానం జనసేనకు కేటాయించిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో బాధపడ్డారని, వారిని అర్థం చేసుకోవాలని కోరారు. శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర , అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి , పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాజాబాబు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.