Tearful Farewell to Shatrucharla శత్రుచర్లకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:34 AM
Tearful Farewell to Shatrucharla టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు, గ్రామస్థులు, కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం చినమేరగింలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. శత్రుచర్ల సోదరుడి కుమారుడు పరీక్షిత్‌రాజు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి సంధ్యారాణి దగ్గరుండి పర్యవేక్షించారు.
గొప్ప నాయకుడిని కోల్పోయాం: మంత్రి సంధ్యారాణి
జియ్యమ్మవలస, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు, గ్రామస్థులు, కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం చినమేరగింలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. శత్రుచర్ల సోదరుడి కుమారుడు పరీక్షిత్‌రాజు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి సంధ్యారాణి దగ్గరుండి పర్యవేక్షించారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ‘ గొప్ప నాయకుడిని కోల్పోయాం. ఎందరికో రాజకీయ పాఠాలు నేర్పిన శత్రుచర్ల నిజంగా ఉత్తరాంధ్ర టైగరే.’ అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా విజయరామరాజు ప్రజలకు అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమన్నారు. అనంతరం శత్రుచర్ల విజయరామరాజు సతీమణి శశికళాదేవిని ఓదార్చారు. కాగా చినమేరంగిలోని నివాసంలో శత్రుచర్ల పార్థివదేహం చూసి.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, జగదీశ్వరి, ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తదితరులు కంటతడి పెట్టుకున్నారు. తన రాజకీయ గురువు విజయరామరాజుకు బొబ్బిలిలో విగ్రహం పెడతానని బేబీనాయన భావోద్వేగంతో తెలిపారు. కురుపాం జడ్పీటీసీ సభ్యుడు వీరేష్ చంద్రదేవ్, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, తదితరులు అంతియ యాత్రలో పాల్గొన్నారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్సీ డి.జగదీష్, డాక్టర్ డి.రామమోహనరావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ తదితరులు సంతాపాన్ని తెలియజేశారు.
బాధనిపించింది
పార్వతీపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మరణ వార్త తనకు ఎంతో బాధనిపించిందని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతి రాజకీయ, సామాజిక రంగాలకు తీరని లోటన్నారు. శత్రుచర్ల ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.