Teak Trees పాఠశాలల్లో టేకుచెట్లేగా.. నరికేద్దాం!
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:47 PM
Teak Trees in School Campuses to Be Felled ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టేకు చెట్లకు రక్షణ కొరవడింది. రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వాస్తవంగా పాఠశాలల్లో టేకు చెట్లను విక్రయించాలంటే పాఠశాల కమిటీ ఆమోదంతో పాటు ముందుగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ అవేమీ జరగడం లేదు.
ప్రభుత్వ బడుల్లో చెట్లకు రక్షణ కరువు
అనుమతుల్లేకుండా యథేచ్ఛగా నరికివేత
దుంగలను డిపోలకు తరలించి రూ.లక్షల్లో ఆర్జన
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పార్వతీపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టేకు చెట్లకు రక్షణ కొరవడింది. రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వాస్తవంగా పాఠశాలల్లో టేకు చెట్లను విక్రయించాలంటే పాఠశాల కమిటీ ఆమోదంతో పాటు ముందుగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ అవేమీ జరగడం లేదు. కొంతమంది అనధికారికంగా వాటిని నరికివేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు దుంగలను సమీపంలో డిపోలకు తరలించి.. రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. మొత్తంగా అనుమతుల్లేకుండా పాఠశాలల్లో టేకు చెట్లను నరికేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇదీ పరిస్థితి..
- ఈ ఏడాది మేనెలలో పార్వతీపురం మండలం అడారు పాఠశాలలో 14 టేకు చెట్లను అక్రమంగా నరికి టింబర్ డిపోనకు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. అయితే 14 టేకు చెట్లలో ఆరు చెట్ల దుంగలు లభించగా.. మిగతా ఎనిమిది చెట్ల సంగతి ఏమటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్వతీపురం నియోజకర్గానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి కోసం కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఈ ఘనకార్యం చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.
- తాజాగా సీతానగరం మండలంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరిపివలస జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని మూడు టేకు చెట్లను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి సెలవులో ఉన్న సమయం చూసి ఈ పని కానిచ్చేశారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ వర్గాలను సంప్రదించగా ఈ విషయం తమ వరకు రాలేదన్నారు. ఫిర్యాదులొస్తే దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. దీనిపై ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎంఎస్‌ఎన్ రాజును వివరణ కోరగా.. ‘పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్ల వల్ల పక్కనే ఉన్న అంగవాడీ భవనానికి ఇబ్బంది కలుగుతుందని వాటిని నరికేసినట్లు తెలిసింది. అయితే స్కూల్ యాజమాన్యానికి తెలియకుండా నరకడం తగదు. దుంగలు పాఠశాల ఆవరణలో ఉన్నాయి. స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల కమిటీతో చర్చించి చెట్ల నరికిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
- గతంలో సీతంపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా టేకు చెట్లు నరికేశారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగినా.. తీసుకున్న చర్యలేమిటో నేటికీ బహిర్గతం కాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.