Teaching as the Sole Mission.. బోధనే పరమావధిగా..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:37 AM
Teaching as the Sole Mission.. జిల్లాలోని ఎందరో ఉపాధ్యాయులు బోధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కాలినడకన రాళ్లు రప్పలు దాటి.. ఘాట్ రోడ్లును దాటుకుని.. కొండలెక్కి పాఠశాలలకు చేరుకుంటున్నారు. గిరిజన విద్యార్థులతో మమేకమై .. వారికి అర్థమయ్యేలా బోధిస్తున్నారు.
మూరుమూల గిరిజన గ్రామాల్లో పాఠాలు బోధిస్తున్న టీచర్లు
సమాజ సేవలోనూ కీలకపాత్ర పోషిస్తున్న వైనం
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
జిల్లాలోని ఎందరో ఉపాధ్యాయులు బోధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కాలినడకన రాళ్లు రప్పలు దాటి.. ఘాట్ రోడ్లును దాటుకుని.. కొండలెక్కి పాఠశాలలకు చేరుకుంటున్నారు. గిరిజన విద్యార్థులతో మమేకమై .. వారికి అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాళ్లు తేలే మార్గంలో జంతు భయం ఉన్నా.. వాటిని లెక్కచేయండా ధైర్యంగా పాఠశాలకు చేరుకుంటున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే మరోవైపు వారికి పారిశుఽధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరికొందరు రిటైర్డ్ అయినా బోధనతో పాటు సమాజ సేవలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.
కొండెక్కి.. పాఠశాలకు చేరుకుని..
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు కొండ శిఖర గ్రామాలకు రహదారులు లేవు. అయినా పలువురు ఉపాధ్యాయులు కిలోమీటర్ల పొడవున నడిచి .. కొండెక్కి గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. తాడికొండకు చెందిన సుజాత అనే ఉపాధ్యాయురాలు కూడా ఇదే విధంగా పాఠశాలకు వెళ్తున్నారు. రోజూ ఆమె తాడికొండ నుంచి వాహనంపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ తాండి కొండ వరకు వెళ్లారు. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి అడ్డంగి జంగిడిభద్ర అనే గిరిశిఖర గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తారు. తిరిగి సాయంత్రం ఆమె కాలినడకన కొండ దిగి ఇంటికి చేరుకుంటారు. తాడికొండకు చెందిన మరో ఉపాధ్యాయురాలు నిర్మల కూడా ఎగువ తాడికొండ నుంచి నడుచుకుని గిరిశిఖర గ్రామమైన దేరుగండ పాఠశాలకు చేరుకుని గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కాలినడకన రోజూ పాఠశాలకు వెళ్తూ.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నారు.
ఘాట్ రోడ్డును దాటుకుని..
భామిని, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రమాదకర ఘాట్ రోడ్డుకు దాటుకుని పాఠశాలకు చేరుకుని విధులు నిర్వర్తిస్తున్నారు మణిగ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి.లక్ష్మి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన ఆమె గతంలో ఇచ్ఛాపురం మండలంలో పనిచేశారు. బదిలీపై గిరిశిఖర గ్రామం మణిగకు వచ్చి.. తొలినాళ్లలో భయపడ్డారు. మారుమూల ప్రాంతం, మట్టి రహదారి చూసి భయపడినా, విద్యార్థుల కోసం ఆ కష్టాలను అధిగమించారు. రోజూ స్కూటీపై ప్రమాదకర ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ.. తివ్వకొండ శిఖరంలోని మణిగ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. బడికి రాని చిన్నారులను ఇంటింటికీ వెళ్లి తీసుకొచ్చి చదువు నేర్పుతున్నారు. గిరిజన విద్యార్థులకు తెలుగుభాష అర్థం కావడం కొంత కష్టంగా ఉండడంతో భాషా వలంటీర్ల సహకారంతో వారికి సులభంగా బోధిస్తున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆనందం ముందు ఘాట్ రోడ్డు కష్టాలు, భయం కనిపించడం లేదని లక్ష్మీ తెలిపారు.
సమాజ సేవలో రిటైర్డ్ మాస్టారు
ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా సమాజ సేవను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఘనసర గ్రామానికి చెందిన ఎరుకుమజ్జి అప్పలనాయుడు మాస్టారు. 2012లో వీరఘట్టం మండలం తలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన గ్రామాభివృద్ధికి అంకితమయ్యారు. ఘనసరలో ఆలయ నిర్మాణానికి తనవంతు సాయం చేశారు. గ్రామీణ వికాస్ సంఘ్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారు. సీసీఎల్ సంస్థ సహకారంతో 2016లో ఏర్పాటైన ప్లాంట్ ద్వారా రూ.5కే 20 లీటర్ల తాగునీరు అందిస్తున్నారు. విద్యార్థుల కోసం ఘనసరలో కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయించి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. భామిని, కొత్తూరు మండలాల్లో రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి.. వలంటీర్లతో నిర్వహిస్తున్నారు. మరోవైపు మొక్కల పెంపకం చేపడుతూ.. పచ్చదనం పరిరక్షణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.