చిన్నారులకు ఆటపాటలతో బోధించండి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:18 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో బోధించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు.
సీతంపేట రూరల్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో బోధించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. గురువారం పెదరామ గ్రామంలో పీవో పర్యటించారు. ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను పీవో ఆదేశించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ చిన్నారులతో పీవో ముచ్చటించారు. చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువు, ఎత్తు వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామ పరిసరాలను పరిశీలించి గ్రామాన్ని ముస్తాబుగా తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించి అక్కడ విద్యార్థులతో పీవో మాట్లాడారు. పీవోతో పాటు తహసీల్దార్ శ్రీకన్య, సర్పంచ్ తిరుపతిరావు ఉన్నారు. అనంతరం పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ గురువారం సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినిల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పాఠాలు బోధించారు. విద్యార్థినులతో కలిసి పాఠశాలలో పీవో భోజనం చేశారు.