Share News

రేపు టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:37 AM

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది.

 రేపు టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం

-రాష్ట్ర కార్యాలయానికి రావాలని 45 మందికి ఆహ్వానం

- నేడు బయలుదేరనున్న తెలుగుతమ్ముళ్లు

విజయనగరం రూరల్‌, జనవరి 25 ( ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాఽధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సోషల్‌ మీడియా ప్రతినిధులు అంతా కలిసి 45 మంది ఉన్నారు. వీరికి మంగళవారం ఉదయం 8.30 గంటలకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆహ్వానం అందింది. దీంతో వీరంతా సోమవారం మధ్యాహ్నం బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ కమిటీలను అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నిటితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించనుంది.

వచ్చే నెలలో అనుబంధ సంఘాల కమిటీలు..

టీడీపీకి పది వరకూ అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు సంబంధించి పదవుల ఎంపికను చేపట్టాలని ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యకుడు కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శి ప్రసాదుల ప్రసాద్‌కి అధిష్ఠానం సూచించింది. ఎంపీ, ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, పార్టీ కోసం కష్టించి పనిచేసే వారందరికీ చోటుదక్కేలా, సామాజిక సమీకరణలను సమన్వయం చేస్తూ జాబితాను పంపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ దిశా నిర్దేశం చేశారు. జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తరువాత ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంత వరకూ అనుబంధ సంఘాల కమిటీల కూర్పు ముందుకు సాగలేదు. జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం మంగళవారం జరగనుంది. ఈ నెలఖరులోగా జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి, ఫిబ్రవరి తొలి వారంలోగా జిల్లా అనుబంధ సంఘాల కమిటీల కూర్పుని పూర్తిచేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 26 , 2026 | 12:37 AM